ఏపీలో టీడీపీ+వైసీపీ+కాంగ్రెస్ స‌ర్కార్

ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం ఉందా లేదా పైన చెప్పుకున్న‌ట్టు టీడీపీ+వైసీపీ+కాంగ్రెస్ ఉమ్మ‌డి స‌ర్కార్ అధికారంలో ఉందా అన్న సందేహాలే ఇప్పుడు ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ డౌట్ ఇత‌ర పార్టీలకో లేదా విప‌క్షాల‌కో వ‌స్తే అర్థం ఉంది. ఈ డౌట్ ఇప్పుడు అధికార టీడీపీ వాళ్ల‌కే వ‌స్తుండ‌డం మ‌రో షాక్‌. ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి వ‌చ్చిన 4 గురు ఎమ్మెల్యేల‌కు కీల‌క మంత్రి ప‌ద‌వులు కేటాయించిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కింది.

ఏపీలో ఏప్రిల్ 2 నుంచి అధికార టీడీపీ ప్ర‌భుత్వం పోయి పైన చెప్పుకున్న ఉమ్మ‌డి కూట‌మే అధికారంలోకి వ‌చ్చింద‌ని చెప్పుకోవాలి. బాబు కేబినెట్ ప్ర‌క్షాళ‌న సంద‌ర్భంగా కొత్త‌గా 11 మందిని త‌న కేబినెట్‌లో చేర్చుకున్నారు. వీరిలో న‌లుగురు వైసీపీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్లే. అలా టీడీపీ ప్ర‌భుత్వంలో వైసీపీ భాగ‌స్వామ్యమైంది.

ఇక వైకాపా మాత్ర‌మే కాదు కాంగ్రెస్‌కు కూడా ప్ర‌భుత్వంలో స్థానం ద‌క్కిన‌ట్టే అనుకోవాలి. గ‌తంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత‌కాలం అక్క‌డ మంత్రిగా ఉన్న గంటా శ్రీ‌నివాస‌రావు.. టీడీపీలో చేరి మ‌ళ్లీ మంత్రి అయ్యారు. ఇక అదే కాంగ్రెస్‌లో మంత్రిగా ప‌నిచేసిన పితాని స‌త్య‌నార‌య‌ణ పార్టీ మారి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి తాజా విస్త‌ర‌ణ‌లో మంత్రి అయ్యారు.

ఇక విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్కించుకున్న క‌ళా వెంక‌ట్రావు అయితే టీడీపీ టు ప్ర‌జారాజ్యం, ప్ర‌జారాజ్యం టు టీడీపీలో చేరి ఇప్పుడు మంత్రి అయ్యారు. మొత్తం 26 మంది మంత్రుల్లో ఇలా విప‌క్ష పార్టీల నుంచి ర‌క‌ర‌కాలుగా వ‌చ్చిన వారే ఏడుగురు ఉన్నారు. ఈ లెక్క‌న ఎప్ప‌టి నుంచో పార్టీని న‌మ్ముకున్న వారికి మొండి చేయి త‌ప్ప‌లేదు.

సో ఈ లెక్క‌ల‌న్ని చూస్తుంటే ఆంధ్రాలో టీడీపీకి ఎప్ప‌టి నుంచో సేవ‌చేసి, ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా పార్టీ మార‌ని వారి కంటే జంపింగ్ చేసి, వీలున్న‌ప్పుడ‌ల్లా పార్టీ మారిన వారిన టైం బాగుంద‌నే చెప్పాలి. ఆంధ్రాలో అన్ని పార్టీలు మిత్ర‌ప‌క్షాలేన్న‌మాట‌.