ఆ న‌లుగురు టీడీపీ ఎంపీల‌కు ప్ర‌జాసేవ నై…వ్యాపారాలే జై 

టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కు కొంత‌మంది తెలుగుదేశం ఎంపీలు శ‌ఠ‌గోపం పెడుతున్నారు. పార్టీని, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండా కేవ‌లం వ్య‌క్తిగ‌త అజెండాతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్వ‌త‌హాగా పారిశ్రామిక వేత్త‌ల‌యిన వీరు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా కేవ‌లం త‌మ పరిశ్ర‌మ‌ల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ వ్యాపారాలు, వ్య‌క్తిగ‌త స‌మస్య‌ల‌ను ప‌ట్టించుకుని.. ప్ర‌జ‌లను, పార్టీని పూర్తిగా విస్మ‌రించార‌ని అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు చేరువ‌కాక‌పోవ‌డంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో సీఎం చంద్ర‌బాబు వీరిపై గుర్రుగా ఉన్నార‌ట‌.

రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ పనితీరు నాసిరకంగా ఉందని ఆ నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరికీ అందుబాటులో ఉండడం లేదనే విమ‌ర్శ ప్ర‌దానంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసిన ఆయన ఏదైనా నామినేటెడ్‌ పదవి తీసుకుని రాజకీయాలకు దూరంగా వెళ్లిపోవాలని భావిస్తున్నార‌ట‌. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన గల్లా జయదేవ్‌ పనితీరు నిరాశాజనకంగా ఉందట. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన్ను గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం కల్పించి గెలిపిస్తే అక్క‌డి ప్రజలకు చాలా దూరమ‌య్యారనే వార్తలు వస్తున్నాయి.

ఎంపీగా ఎన్నుకుంటే జిల్లాకు భారీస్థాయిలో పరిశ్రమలు తెస్తారని, జిల్లాలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తారని చాలా మంది ఆశించారు. కానీ ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వ్యాపారానికే ఎక్కువ సమయం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరో ఎంపీ కేశినేని నాని వ్యవహారం కూడా పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ట్రావెల్స్‌ వ్యవహారంలో రవాణాశాఖ కమిషనర్‌ సిబ్బందిపై దాడి చేయటం, అన్యాపదేశంగా ప్రభుత్వ వ్యవహారాలపై కామెంట్లు చేయటం వంటి చర్యలతో చంద్రబాబు గుర్రుగా ఉన్నారట.

వచ్చే ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకుండా వేరే వారికి సీటు ఇస్తారనే ఆందోళన నానిలో ఉందని అందుకే ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అంటీముట్టనట్లువ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇక చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌.. అధిష్టానంపై విమర్శలు గుప్పించి మౌనంగా ఉన్నారు. ఇక ఆయనకు మాత్రం మళ్లీ సీటు ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీకి మేలు చేస్తారని పిలిచి మ‌రీ సీటు ఇస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌.