బాహుబ‌లిపై కేసీఆర్ క‌క్ష తీర్చుకున్నాడా..!

ప్ర‌పంచవ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు ఇలా ప్ర‌వర్తిస్తోంది? తెలుగు సినిమా గురించి దేశంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు వేనోళ్ల పొగుడుతున్న వేళ‌.. టీఆర్ఎస్ నాయ‌కులు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ సినిమా విష‌యంలో కాస్త డిఫ‌రెంట్‌గా ప్ర‌వ‌రిస్తున్నారా ? అన్న సందేహాలు అంద‌రి మ‌దిలోను క‌లుగుతున్నాయి. మొన్న‌టికి మొన్న `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` సినిమాకు, అంత‌కుముందు రుద్ర‌మ‌దేవి సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం.. ఇప్పుడు `బాహుబ‌లి-2` సినిమాకు రాయితీలు ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు హైకోర్టు ఇచ్చిన టికెట్ల ధ‌ర‌ల‌ పెంపు, ప్రీమియ‌ర్ షోల‌ను వ్య‌తిరేకించ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశ‌మవుతోంది.

ఎప్పుడెప్పుడా అని అంతా వెయిట్ చేస్తున్న `బాహుబ‌లి-2` సంద‌డి థియేట‌ర్ల‌లో మొద‌లైంది. బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు అమ‌రేంద్ర బాహుబ‌లి సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9వేల థియేట‌ర్ల‌లో రిలీజైంది. భార‌తీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాల్లొ మార్మోగిస్తున్న ఈ చిత్రంపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు శీత కన్ను వేసింద‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం, హైకోర్టు కూడా సినిమాకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డితే.. తెలంగాణ మాత్రం వాటిని పాటించేందుకు స‌సేమిరా అంటోంది.

ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజుకు ఏకంగా ఆరు ఆట‌ల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌లిచ్చేసింది. హైకోర్టు సైతం త‌న వంతు చేయి వేసింది. మొద‌టి వారం రోజులూ సాధార‌ణ థియేట‌ర్ల‌లో కూడా బాహుబ‌లి సినిమాకు టికెట్లు పెంచి అమ్ముకోవ‌చ్చ‌ని తీర్పిచ్చింది. కానీ వీటికి తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్ప‌కోలేదు. తెలంగాణ‌లో 5 షోల‌కే అనుమ‌తిచ్చిన ప్ర‌భుత్వం.. ప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. టిక్కెట్ల రేట్లు పెంచితే ఊరుకోన‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రైనా టికెట్టు ధ‌ర పెంచితే, ఫిర్యాదు చేయండంటూ తెలిపారు.

ఇది ఇలా ఉండ‌గానే రాత్రి చాలా థియేట‌ర్ల‌లో అధికారులు కూడా త‌నిఖీలు చేశారు. ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర య‌వ‌నిక‌పై అత్య‌ద్భుత కావ్య‌మ‌ని అంద‌రూ వేనోళ్ళ కొనియాడుతున్నా… తెలంగాణ‌లో మాత్రం అవేమీ కుద‌ర‌దంటున్నారు. నాయ‌కులు. గ‌తంలో రుద్ర‌మ దేవి చిత్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం వినోద ప‌న్ను మిన‌హాయింపునిచ్చింది. అప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ఇవ్వ‌నంది. బాల‌కృష్ణ 100వ చిత్రం `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి` చిత్రానికి వినోద‌ప‌న్ను మిన‌హాయించాయి ఇరు ప్ర‌భుత్వాలు! మ‌రి వాటికి ఇచ్చిన మిన‌హాయింపు.. బాహుబ‌లికి ఎందుకు ఇవ్వ‌లేదో!!

దీని వెనుక గ‌ల కారణాలేమిటో తెలియ‌క‌పోయినా తెలంగాణ చ‌రిత్ర నేప‌థ్యంతో తెర‌కెక్కిన రుద్ర‌మ‌దేవి సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం కేసీఆర్ స‌ర్కార్‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే ఇప్పుడు బాహుబ‌లి విష‌యంలో వారు స్ట్రిట్‌గా ఉన్నార‌ని, అలాగే ప్రేక్ష‌కులు దోపిడీకి గురికాకుండా ఉండేందుకే కేసీఆర్ స‌ర్కార్ ఇలా చేసి ఉంటుంద‌న్న కోణాల్లో కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.