ఆ రెడ్డి నాయ‌కుడే టి కాంగ్రెస్ సీఎం?!

ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం.. అన్న‌ట్లు ఉంది టికాంగ్రెస్ ప‌రిస్థితి. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్లు స‌మయం ఉండ‌గానే.. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైపోయింది. సీఎం అభ్య‌ర్థిగా ఎవ‌రైతే బాగుంటుందో ఇప్పటి నుంచే.. అధిష్టానానికి విన్న‌పాలు కూడా వెళుతున్నాయ‌ట‌. అంతేగాక సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో తేలితేగాని ఒప్పుకోమని కార్య‌కర్త‌లు కూడా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. మ‌రి నాయ‌కులే తొంద‌ర‌ప‌డుతున్నారో.. లేక కార్య‌క‌ర్త‌లే తొంద‌ర ప‌డుతు న్నారో తెలియ‌దు గానీ.. అధిష్టానానికి ముందుగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అనుచ‌రులు ప్ర‌తిపాద‌న పంపారు. త‌మ నాయ‌కుడిని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాలని ఇందులో కోరార‌ట‌.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి చ‌ర్చ మొద‌లైంది. నిజానికి, సీఎం అభ్య‌ర్థిని ఎన్నిక‌ల‌కు ఇన్నాళ్లు ముందుగా ప్ర‌క‌టించిన సంస్కృతి కాంగ్రెస్ లో లేద‌నే చెప్పాలి. కానీ, తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు వేరుగా ఉన్నాయ‌నీ, తెరాసను స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలంటే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఇప్పుడే ప్ర‌క‌టించాల‌ని పార్టీ నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాలంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అనుచ‌రులు కొంత‌మంది పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌నీ, ఈ నేప‌థ్యంలో ఉత్త‌మ్ అభ్య‌ర్థిత్వాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తే తెరాస‌ను ఎదుర్కోవ‌డంలో ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్లొచ్చ‌నేది వారి ఆలోచ‌న‌. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న అనుస‌రించిన రాజ‌కీయ వ్యూహాల‌ను, ఫిరాయింపుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ అధిష్టానాన్ని కోరారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మాత్ర‌మే ఎందుకు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాలీ, వేరే నాయ‌కులు లేరా అనే ప్ర‌శ్న‌కీ ముందుగానే స‌మాధానం చెప్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు భారీ ఎత్తున నిధులు అవ‌స‌రముంటుందనీ, గ‌తంతో పోల్చితే ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌.

సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌క‌పోతే నిధుల సేక‌ర‌ణ విష‌యంలో ఎవ‌రూ చొర‌వ చూప‌ర‌ట‌. సీఎం అభ్య‌ర్థిగా ఉత్త‌మ్ ను ప్ర‌క‌టిస్తే.. ఆయ‌న నిధుల‌ను భారీ ఎత్తున రాబ‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ పార్టీ అధిష్టానాన్ని కొంత‌మంది నేత‌లు కోరారు. మ‌రి, టి.కాంగ్రెస్ నేత‌ల ప్ర‌తిపాద‌న‌ను అధిష్టానం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.