2019 వార్‌: ఏపీ-తెలంగాణ‌లో రాజకీయాలను శాసిస్తున్న కులాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డి అప్పుడే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ధ్య‌లో జ‌రిగే చిన్నా చిత‌కా ఎల‌క్ష‌న్ల‌తో పాటు 2019 ఎన్నిక‌ల‌పైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణ‌లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మ‌ధ్య ప్ర‌ధానంగా పోరు ఉంటుంది ? అస‌లు ఎవ‌రి బ‌లం ఎంత‌? ఎవ‌రి బ‌ల‌గం ఎంత‌? ఒంట‌రిగా బ‌రిలో నిలిచి ఒకే పార్టీ అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఉందా ? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు జ‌నాల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల మ‌దిని తొల‌చి వేస్తున్నాయి.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌ను కులాలు శాసిస్తున్నాయి. ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే కుల‌మే కీల‌క‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో అధికారం కోసం ఏపీలోను, తెలంగాణ‌లోను రెండు చోట్ల కులాల ప్ర‌తిపాదిక‌ను ట్ర‌యాంగిల్ ఫైట్ జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇద్ద‌రు సీఎంలు.. త‌మ ప‌థ‌కాల అమ‌లులో కులాలకే అధిక ప్రాధాన్య‌త‌లిస్తున్నారు.

ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌తి కులానికో కార్పొరేష‌న్‌, కులానికో ఫండ్ వ‌స్తున్నాయి. కులాల ఓటు బ్యాంక్‌ను బేస్ చేసుకునే ఇదంతా చేస్తున్నార‌నేది ఓపెన్ సీక్రెట్‌. ఏపీ విష‌యానికి వ‌స్తే టీడీపీ – వైసీపీ – జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ముక్కోణ‌పు పోరు క‌నిపిస్తున్నా…ఈ మూడు పార్టీల వెన‌క ఆయా పార్టీల‌కు బ‌లంగా కొమ్ము కాసే కొన్ని కులాల పోరు కూడా క‌నిపిస్తోంది.

ఇక తెలంగాణ‌లో ఇటీవ‌ల కాంగ్రెస్‌, టీడీపీలు కొంచెం పుంజుకున్నా అధికారాన్ని సొంతం చేసుకునేంత‌గా కాదు. ఇక్క‌డ కూడా 2019లో టీఆర్ఎస్ – బీజేపీ – ఎంఐఎం మ‌ధ్య ముక్కోణపు పోటీ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మూడు పార్టీల వెన‌క కూడా కులాల లెక్క‌లు బ‌లంగా ఉన్నాయి. మ‌రి ట్ర‌యాంగిల్ ఫైట్ ఏదో ఒక పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుందా ? లేదా ఎవ్వ‌రూ మేజిక్ ఫిగ‌ర్ సాధించ‌లేరా ? అన్న‌ది చూడాలి.