విప‌క్షాల‌కు చిక్కిన టీడీపీ, టీఆర్ఎస్‌ .. సెల్ఫ్ డిఫెన్స్‌లో పార్టీలు

ఇరు తెలుగు రాష్ట్రాల‌ అసెంబ్లీ స‌మావేశాల్లో  పూర్తి ఆధిప‌త్యం చెలాయిస్తున్న అధికార ప‌క్షాలు.. చివ‌ర‌కు విప‌క్షాల చేతికి చిక్కాయి! తెలంగాణ‌తో పోల్చితే ఏపీలో బ‌ల‌మైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేత‌లు స‌మాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణ‌లో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. త‌మ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార ప‌క్షాలు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డిపోయాయి! టీడీపీ, టీఆర్ఎస్‌ నేత‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు విప‌క్షాల‌కు ఆయుధంగా మారింది.

తెలంగాణలోని భూపాల్ పల్లి జిల్లా మహదేవర్ పల్లి అడవుల్లో దుప్పుల్ని వేటాడిన కేసులో టీఆర్ఎస్‌కు చెందిన మంత్రి కుమారుడి భాగస్వామ్యం ఉండటం.. ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసిన వైనం సంచలనంగా మారాయి. సీఎం తర్వాత.. కీలకస్థానంలో ఉండే మంత్రి కుమారుడు దుప్పుల వేట ఉదంతంలో నిందితుడిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతానికి సంబంధించి ఆదివారం టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నేత ఒకరిపై కేసు నమోదు చేశారు, దీంతో విపక్ష నేతలు బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ ఉదంతం కానీ అసెంబ్లీలో చర్చకు వస్తే.. లేనిపోని తలనొప్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇక ఆంధ్రాలో కూడా అధికారపక్షానికి కొత్త తలనొప్పులు మొద‌ల‌య్యాయి. మొన్నటి వరకూ పవర్ తో తమ అధిపత్యాన్ని ప్రదర్శించిన టీడీపీ అధికారపక్ష నేతలు.. రవాణా శాఖ కమిషనర్ పై దాడికి యత్నించటం.. చేత్తో తోయటానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు రావటం సంచలనంగా మారింది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఒక ఎంపీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు దాడి చేసే స్థాయికి వెళ్లటం.. ఒకరు ఆయన్ను నువ్వెంత అన్న రీతిలో నెట్టేసిన వైనంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

అలాంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోని నేపథ్యంలో.. అసెంబ్లీ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ మధ్యన జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బస్సు డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఏపీ విపక్ష నేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నిరసన తెలిపే ప్రయత్నంలో  పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్లో జగన్ పై కేసు నమోదు చేసేంతవరకూ ఏపీ సర్కారు నిద్రపోలేదు. మ‌రి ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల‌పై ఇలా సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై విప‌క్షం సీరియ‌స్‌గా ఉంది. మ‌రి ఈ రెండు విష‌యాల్లోనూ అధికార‌ప‌క్షాలు.. సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డిపోయాయి!