న‌ల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్‌ .. ఎలా ఉంటుంది?

తెలంగాణ‌లోని అన్ని జిల్లాల‌పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి ఆధిప‌త్యం సంపాదించారు. కానీ ఒకే ఒక్క జిల్లా న‌ల్గొండ‌లో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ ఇబ్బంది ప‌డుతోంది, మెజారిటీ సాధించినా.. కాంగ్రెస్‌కు కూడా ఆ జిల్లాలో మంచి ప‌ట్టు ఉండ‌టంతో కేసీఆర్..  ఈజిల్లాపై దృష్టిపెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నల్గొండలో కూడా పూర్తి మెజారిటీ సాధించేందుకు స్వ‌యంగా రంగంలోకి దిగ‌బోతున్నారు. ముఖ్యంగా అక్క‌డి కాంగ్రెస్ నేత‌ల‌కు చెక్ చెప్పేలా.. తాను న‌ల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. త‌న స‌న్నిహితుల‌తో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ని స‌మాచారం!!

రాజ‌కీయంగా న‌ల్గొండ‌కు ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. జానారెడ్డి, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వంటి దిగ్గ‌జ నేత‌లు.. ఇప్పుడు న‌ల్గొండ నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాంగ్రెస్ బ‌లంగా ఉన్న న‌ల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందితే ఇక త‌న‌కు తిరుగుండ‌దనేది ఆయ‌న వ్యూహ‌మ‌ట‌! 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకోగా, కాంగ్రెస్ కూడా ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. అలాగే 2015 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించినా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఓడిపోయింది. ఇది టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు కేసీఆర్‌ను కూడా ఆలోచనలో పడేసింది.

మ‌రోవైపు టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా.. కొంతమేర స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత వస్తోంది. కేసీఆర్‌ చేయించిన సర్వేల్లోనే ఈ విషయం వెల్లడైంది. అందులోనూ పాత నల్లగొండ జిల్లా పరిధిలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల టీఆర్‌ఎస్‌ నేతల గ్రాఫ్‌ పడిపోగా… కాంగ్రెస్‌ నేతల గ్రాఫ్‌ మెరుగు పడింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో పార్టీ బలాన్ని, ఊపును పెంచేందుకు వ్యూహం పన్నుతు న్నారని, అందులో భాగంగా అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నా రని తెలుస్తోంది.

కేసీఆర్‌కు ఉమ్మడి నల్గొండ‌ జిల్లాకు చెందిన పలువురితో రాజకీయంగా, వ్యక్తిగతంగా సంబంధాలున్నాయి. అలాంటి వారిలోని ఓ మిత్రుడు ఇటీవల కేసీఆర్‌ను కలిశారని.. ఆ సమయంలోనే నల్లగొండ జిల్లా నుంచి పోటీ విషయాన్ని కేసీఆర్‌ చూచాయగా వెల్లడించారని తెలుస్తోంది. `నేను ఈసారి ఎలాగూ రెండు చోట్ల పోటీ చేస్తాను. నల్లగొండ జిల్లా నుంచి చేద్దామనుకుంటున్నా.. ఎలా ఉంటుంది.. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తారా.`అని ఆరా తీసినట్లు తెలిసింది.