ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో మార్పు

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విజ‌యంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్ర‌వాహం అధికంగా ప్ర‌భావం చూపిన ఈ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల‌ను కైవసం చేసుకోవ‌డంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో ఎందరో ఓటర్లు అమ్ముడుపోయారని స్వంత పార్టీ నాయకులే చెబుతున్న సమయాన, ఆ గెలుపుపై పండుగ చేసుకొని ఆనందించడం సరికాదని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఒక వైపు అధికారం ఉంది. ఓట్లు కొనేందుకు లక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మూడు స్థానాల్లో వంద ఓట్ల మెజార్టీ కూడా అభ్యర్థులు సాధించలేకపోయారు. టీడీపీ ఓటర్లు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడి విపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటే తాము అధికారంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అనే అనుమానం వ్యక్తం అవుతోందని మాజీ మంత్రి ఒకరు బాహాటంగానే ఆవేశంతో దుయ్యబట్టారు. వెన్నుపోటు పొడిచిందెవరు…? అనే విషయంపై ఇంత వరకు ఆరా తీయలేదు..గెలిచామని సంబరపడుతున్నారే తప్ప…అసలేం జరిగిందనే విషయం తండ్రీకొడుకులిద్దరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

ప‌ట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లు తమ వ్యతిరేకతను స్వల్పంగా చూపించారు. అభ్యర్థి ఎంపికను తప్పుపట్టారు. వాస్తవానికి టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి పరోక్షంగా విజయం సాధించినట్లే కనిపించింది. చెల్లని ఓట్లతో ఆయన చెల్లని కాసుగా మారిపోయారు. మున్సిపల్‌ మంత్రి నారాయణపై ఆధారపడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని చంద్రబాబుకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ‘రెడ్డి’ సామాజికవర్గాన్ని కాదని ఇతర వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చి అధికార పెత్తనం ఇస్తే పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా పరిస్థితి ఉంటుంది.

ఈ విషయాన్ని కొంత మంది చంద్రబాబును కలిసినప్పుడు వివరించగా `కొన్ని తప్పులు జరిగాయి. త్వరలో సరిదిద్దుతాను. ఏ జిల్లాలో ఎవరెవరికి అధికారం అప్పచెప్పాలో తెలుసుకున్నాను. అదే దారిన వెళ్లబోతున్నాను. నాకు సన్నిహితుల కన్నా పార్టీని గెలిపించే సత్తా ఉన్నావారే తనకు కావాలి. ఇన్ని రోజులు ఆయా జిల్లాల్లో పార్టీ బలాన్ని ఎక్కువగా అంచనా వేశాను. ఆ తరువాత అది బలుపు కాదు వాపు అని తెలుసుకున్నాను. ఈ పరిస్థితిని మరో పది రోజుల్లో సరిదిద్దుతాను. ఇక పార్టీపై దృష్టిసారిస్తా. 2019 ఎన్నికల్లో అది వాపు కాదు బలుపేనని రుజువు చేద్దామ`ని చెప్పారట.