రాష్ట్ర‌ప‌తి పోరులో ఎన్డీయే బ‌లం ఎంత‌..! గ‌ట్టెక్కుతుందా..!

ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం మ‌రికొన్ని నెల‌ల్లో ముగుస్తున్న వేళ‌.. కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌నే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. అయితే లోక్‌స‌భ‌లో పూర్తి మెజారిటీ ఉన్నా.. రాజ్య‌స‌భ‌లో మాత్రం ఇంకా మెజారిటీ సాధించ‌లేక‌పోయింది. యూపీలో ఘ‌న‌విజ‌యం సాధించినా.. ఇంకా రాజ్య‌స‌భ ఎంపీల ప‌ద‌వీ కాలంపూర్తికాక‌పోడంతో వేచిఉండ‌క తప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్రప‌తి పోరులో ఎన్డీయే ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థి విజ‌యం ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌వుతుంద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. రాజ్య‌స‌భ‌లో మెజారిటీ లేక‌పోవ‌డంతో.. ఇప్ప‌టికే కీల‌క‌మైన బిల్లుల‌ను ఆమోదించుకోలేక అవ‌స్థ‌లు ప‌డుతున్న ఎన్డీఏకి.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య ఎదురైంది.

భారత 14వ రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 9న మూడు లోక్‌సభ, పది రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగి, 15న ఫలితాలు ప్రకటించాక ఈ ఎన్నికలో పాల్గొనే అర్హత ఉన్న ఎలక్టర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ ఖరారు చేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్లు వేసే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మొత్తం 29 రాష్ట్రాలు, అసెంబ్లీలున్న రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, ఢిల్లీ అసెంబ్లీ సభ్యులను కలిపి ఎలెక్టరల్‌ కాలేజీ అని పిలుస్తారు. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీల సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఎలెక్టరల్‌ కాలేజీ సభ్యులు 4896. మొత్తం ఎలెక్టర్ల ఓట్ల విలువ 10,98,882. ఎలెక్టర్లందరూ ఓటేస్తే మెజారిటీకి అవసరమైన ఓట్ల విలువ 5,49,442.

మార్చి 11న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించాక జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో మెజారిటీ సాధించేందుకు ఎన్డీఏకు ఇంకా దాదాపు 20 నుంచి 24 వేల విలువ గల ఎలెక్టర్ల మద్దతు అవసరమని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 15న ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించాక ఎలెక్టర్ల(ఓటర్లు) సంఖ్య తేలిపోతుంది. ప్ర‌స్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు రాజ్య‌స‌భ‌లో 77, యూపీఏకు 84 సభ్యులుండగా, రెండు కూటముల్లో లేని ఏఐఏడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, బిజూజనతాదళ్, వైఎస్సార్పీపీ వంటి దాదాపు పది పార్టీలకు 82 మంది సభ్యులున్నారు.

ఈ పరిస్థితుల్లో రెండు కూటములకు చెందని, దాదాపు రెండు శాతం చొప్పున ఓట్ల(విలువ) బలమున్న బీజేడీ, ఏఐఏడీఎంకే వంటి ప్రతిపక్షాల్లో ఒక పార్టీ మద్దతు ఎన్డీఏ అభ్యర్థి విజయానికి అవసరమని అంచనావేస్తున్నారు.

లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో (26 సీట్లు తక్కువ) ఉన్న ఎన్డీఏను నడపుతున్న బీజేపీకి సంపూర్ణ మెజారిటీ(281) ఉన్న కారణంగా కాషాయ నేపథ్యం ఉన్న పార్టీ నేతనే దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.