దేవినేని త‌న‌యుడికి కీల‌క బాధ్య‌త‌లు

పార్టీలో యువ‌శ‌క్తిని బ‌లోపేతం చేసేందుకు టీడీపీ స‌న్నద్ధ‌మవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌విని తెర‌పైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. త‌నయుడు అవినాశ్‌కు ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌కు.. అవినాశ్‌కు మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే త‌న సొంత వ‌ర్గాన్ని తయారుచేసుకునే ప‌నిలో చిన‌బాబు కూడా నిమ‌గ్న‌మై ఉండ‌టంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛ‌నమే కాబోతోంద‌నేది పార్టీ వ‌ర్గాల స‌మాచారం! అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పార్టీలోకి వ‌చ్చిన వారికే ప్రాధాన్య‌త పెరుగుతోంద‌నేది కొందరి వాద‌న‌!

తెలుగుదేశం పార్టీలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న తెలుగు యువత అధ్యక్ష పదవి దేవినేని అవినాష్ ను వరించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవలే దేవినేని నెహ్రు..ఆయన తనయుడు అవినాష్ లు పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనికి తోడు రాజధాని కేంద్ర ప్రాంత‌మైన కృష్ణా జిల్లాకు చెందిన వాడ‌వ‌డం కూడా ప్ల‌స్ అయింది. దీంతో అవినాష్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి అవసరమైన సందర్బాల్లో యువతను కూడగట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి.

గతంలో పలు కార్యక్రమాల్లో అవినాష్ చురుగ్గా పాల్గొనటంతో పాటు.. కీలక నేతలను సైతం ఎదిరించిన సందర్భాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో యువత పోస్టుకు అవినాష్ సరైన వ్యక్తి అని.. పార్టీలోకి వచ్చిన వారికి ఓ పదవి కూడా అప్పగించినట్లు అవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలకు అవినాష్ కు కూడా ఇది ఓ పునాది అవుతుందని ఓ నేత పేర్కొన్నారు. గతంలో వాస్తవానికి ఈ పోస్టుకు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ పేరు అనుకున్నారు. కానీ..అది పట్టాలు ఎక్కలేదు.

ఇప్పుడు మాత్రం అవినాష్ పేరు జోరుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి అంతటి కీలక పదవి ఇస్తే విమర్శలు వస్తాయనే వాదన వినిపిస్తోంది. అయితే ఇఫ్పుడు మాత్రం చంద్రబాబు అంతకు మించి ఏమి చేస్తున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టీడీపీలో ప్రాధాన్యత పెరుగుతుంది కదా? అని ఓ నాయకుడు ముక్తాయించారు. దేవినేని అవినాష్ కు..నారా లోకేష్ కు సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా సానుకూల అంశంగా మారింది. మ‌రి అవినాష్‌కు ప‌ద‌వి ద‌క్కుతుందో లేదో వేచిచూడాల్సిందే!!