మోదీ-షా త‌దుప‌రి ల‌క్ష్యం కేసీఆరేనా?

`నెక్ట్స్ ఏంటి?` ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతోంది. కాషాయ ద‌ళం ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని.. త‌మ త‌దుప‌రి ల‌క్ష్యంగా చేసుకుంటోంది? ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత‌.. ఆ పార్టీ అధ్య‌క్షుడు ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు? అని అన్ని రాష్ట్రాల నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు! అయితే త‌దుప‌రి ల‌క్ష్యాన్ని కూడా బీజేపీ సెట్ చేసుకుంద‌ట‌. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డేందుకు వీలుగా ఉన్న తెలంగాణ‌ను ఇప్పుడు త‌మ టార్గెట్‌గా ఎంచుకుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల‌కు అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

దేశంలో మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాలు మొద‌ల‌య్యాయ‌నే వారి నోళ్ల‌ను మూయించేలా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. దీని వెనుక వ్యూహ‌మంతా అమిత్ షాదే అన‌డంలో సందేహం లేదు. మోడీ-షా జోడీకి ఎదురులేద‌ని మ‌రోసారి నిరూపించారు.ఆయ‌న ఏ రాష్ట్రంలో క్యాంప్ వేస్తే… అక్క‌డ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ విశ్ర‌మించ‌రు అనేది రుజువైంది. ఇదే ఊపును కొన‌సాగిస్తూ… భాజ‌పా త‌న త‌రువాత టార్గెట్‌ను సెట్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. భాజ‌పా త‌రువాతి ల‌క్ష్యం… ‘ఆప‌రేష‌న్ తెలంగాణ’ అని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టేందుకు భాజ‌పా సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు ఈ మేర‌కు ఇప్ప‌టికే కొన్ని సిగ్న‌ల్స్ వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే కొత్త నాయ‌క‌త్వం కింద రాష్ట్ర నేత‌లంతా ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉండాలని సూచ‌న‌లు వ‌చ్చాయ‌ట‌. తెలంగాణ‌లో పార్టీ ముఖ చిత్రం రాబోయే ఆరు నెల‌ల్లో గ‌ణ‌నీయంగా మారిపోతుంద‌నీ, 2019 లక్ష్యంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు మ‌రింత క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని రాష్ట్ర నేత‌ల‌కు స‌మాచారం అందిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో పార్టీకి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయ‌కుడి అవస‌రం ఉంద‌ని భాజ‌పా పెద్ద‌లు గుర్తించార‌ట‌.

ముఖ్యంగా టీడీపీకి చెందిన ప్ర‌ముఖ నేతపైనా వీరి దృష్టిపడింద‌ట‌. ఆయ‌నపై కేసుల విష‌యంలో కొంత వెన‌క‌డుగు వేస్తోంద‌ని తెలుస్తోంది. అమిత్ షా ఏ రాష్ట్రానికి వెళితే… ఆయ‌న‌తోపాటు కొంత‌మంది నిపుణుల బృందం కూడా అక్క‌డే తిష్ట వేస్తుంద‌ట‌! పార్టీకి స‌పోర్ట్‌గా ఉంటూ వ‌స్తున్న నిపుణుల బృందం ఇక‌పై కొన్నాళ్ల‌పాటు తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ ఆప‌రేష‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుంద‌నీ, అంత‌కుముందుగా రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు ప‌ర్య‌టించేందుకు అమిత్ షా తెలంగాణ‌కు వ‌స్తున్నార‌ని స‌మాచారం. యూపీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాన్ని కొన‌సాగించేందుకు భాజ‌పా స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.