గ‌ల్లా Vs విడ‌ద‌ల‌… జ‌స్ట్ మూడు రోజులే… జ‌నం మూడ్ ఎటు అంటే..?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయ‌కురాలు గ‌ల్లా మాధ‌వి, వైసీపీ నాయ‌కురాలు, మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీల వ్య‌వ‌హారం.. రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇక్క‌డ నుంచి ఎవ‌రు గెలుస్తార‌నేది ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిగానే ఉంది. ఇక‌, విష‌యంలోకి వెళ్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప‌వ‌నాలు మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లో మార్పులు స‌హ‌జమే అయినా.. ఎన్నిక‌ల‌కు ముందు ఈ మార్పులు చోటు చేసుకోవ‌డం మాత్రం ఇబ్బందే.

ఎన్నిక‌ల‌కు ప‌ట్టుమ‌ని నాలుగు రోజుల స‌మ‌య‌మే ఉంది. ఈ నెల 13న సోమ‌వారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ప‌రిస్థితిని ప‌క్క‌న పెడితే.. గుంటూరు వెస్ట్ గురించి టాక్ జోరుగా వినిపిస్తోంది. చిత్రం ఏంటంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కురాలు గ‌ల్లా మాధవి ఒన్‌సైడ్‌గా విజ‌యం ద‌క్కిం చుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. ఎందుకంటే.. ఆ పార్టీకి ఇక్క‌డ బ‌లం ఎక్కువ‌గా ఉంది. పైగా ఆమె స్థానికురాలు కూడా కావ‌డం క‌లిసి వ‌చ్చింది. పైగా ఇది టీడీపీకి కంచుకోట‌. అస‌లు వైసీపీ పుట్టాక ఇక్క‌డ ఆ పార్టీ గెల‌వ‌లేదు.

దీంతో గ‌ల్లా మాధ‌వి విజ‌యం ఖాయ‌మ‌ని అంద‌రూ లెక్క‌లు వేసుకున్నారు. ఇక‌, వైసీపీ నుంచి బ‌రిలో ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ మాత్రం చిల‌క‌లూరి పేట నుంచి వ‌చ్చి.. గుంటూరు ప‌శ్చిమ‌లో పోటీ చేస్తున్నారు. ఇది ఆమె కు కొత్త నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ఆమె గెలుస్తుందా ? అన్న సందేహాలు చాలా మందికి వ‌చ్చాయి. కానీ, పోలింగ్ డేట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే కొద్దీ.. మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలో నేత‌ల‌ను క‌లుపుకొని వెళ్ల‌లేక పోవ‌డం.. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం వంటివి.. ఇప్పుడు గ‌ల్లా మాధ‌వికి ఇబ్బందిగా మారాయ‌నేది వాస్త‌వం.

నిజానికి ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వారిని ప‌క్క‌న పెట్టి మ‌రీ.. గ‌ల్లా మాధ‌వికి టికెట్ ఇచ్చారు. మ‌రి వారిని ఆమె క‌లుపుకొని పోవాలిక‌దా.. వారికి త‌గిన గౌరవం ఇవ్వాలి క‌దా.. ఈ విష‌యంలో ఎక్క‌డో తేడా కొట్టింద‌నే గుసుగుస వినిపిస్తోంది. కూట‌మి నేత‌ల‌తోనూ ఆమెకు అంత స‌ఖ్య‌త లేద‌నే అంటున్నారు. ఈ ప‌రిణామాలు ఆమెకు యాంటీ అయ్యాయి.

పైగా నిల‌క‌డ‌లేని వ్య‌వ‌హారంతోపాటు… రూపాయి ఖ‌ర్చు చేసేందుకు కూడా వెనుకాడుతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. సో.. మొత్తంగా గ‌ల్లా మాధ‌విపై సొంత పార్టీలో కొంత సెగ అయితే.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చివ‌ర‌కు ఇది.. ఎలాంటి మ‌లుపు తిరుగుతుంద‌నేది చూడాలి. ప్ర‌స్తుతం అయితే.. గుంటూరు ప‌శ్చిమ‌లో మార్పు దిశ‌గా ఓట‌ర్లు ఆలోచ‌న చేస్తున్న‌ట్టు చ‌ర్చ సాగుతోంది.