నెల్లూరు ఎమ్మెల్సీ పోరులో ఆధిప‌త్య పోరు

ఎమ్మెల్సీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ‌ నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీకి చుక్కెదుర‌య్యేలా క‌నిపిస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు గాను.. రెండింటిలో సునాయాసంగా గెలుస్తామ‌ని నేత‌లు ధీమాగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో మాత్రం ప్ర‌తిప‌క్షానికి దక్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం! ముఖ్యంగా త‌మ అభ్య‌ర్థుల విజ‌యం కోసం మంత్రి నారాయ‌ణ‌, మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర రెడ్డి వ‌ర్గం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో త‌మ అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తారంటే.. కాదు త‌మ అభ్య‌ర్థే విజ‌యం సాధిస్తార‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నాయి.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు చేతులు ఎత్తేశారు. వాకాటి గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్ఫ‌ష్టంచేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మంత్రి నారాయణ సిఫారుసుతో పోటీలో దిగిన పట్టాభిరామిరెడ్డి నడక నల్లేరుపై నడకలా భావించగా తాజాగా ఆయన గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే టీచర్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కెదుర‌వ‌నుంద‌ట‌.

ఇక్కడ విపక్షాలు బలపరిచిన అభ్యర్థి వైపు మొగ్గు కనిపిస్తోంది. దీంతో మంత్రి నారాయణ ఆయన అనుచరులు రోజులు గడిచిన కొద్దీ నిరాశ, నిస్పృహలోకి వెళ్లిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా విజయం సాధించాలని చంద్రబాబు హెచ్చరించడంలో సర్వశక్తులు ఒడ్డి ఓటర్ల మెప్పుపొందేందుకు ప్రాంతాల వారీగా నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థిని ఏదో విధంగా గెలిపించుకుంటామని, టీచర్ల నియోజకవర్గాల అభ్యర్థిపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని మీడియా వర్గాలకు ఆఫ్‌ ది రికార్డుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది.

బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకుని ఎగవేసిన కేసులో హైకోర్టులో కేసు వేసేందుకు విపక్షాలు సిద్దమయ్యాయనే ప్రచారాన్నిటీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. నిన్న కాక మొన్న కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వాకాటికి చినబాబు మద్దతు ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆయన మద్దతుదారులు మాట్లాడుతూ వాకాటి ఎంపికలో తమ నేత ప్రమేయం లేదని అంటున్నారు. దీంతో ఎవ‌రు గెలుస్తార‌నే అంశంపై ఇప్పుడు తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది.