టీడీపీలో సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్ ఆ ఇద్ద‌రు నేత‌లేన‌ట‌!

ఏపీ అధికార పార్టీలో ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా మారారు. రాష్ట్రంలో టీడీపీని అన్ని విధాలా ప‌రుగులు పెట్టించడంలో ఈ ఇద్ద‌రు నేత‌లు అత్యంత కీల‌కంగా ముంద‌డుగు వేస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు అంద‌రి క‌ళ్లూ ఆ ఇద్ద‌రు నేత‌ల‌పైనే ఉన్నాయ‌ని టాక్ న‌డుస్తోంది. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు. ఒక‌రు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు కాగా మ‌రోక‌రు సీఎం చంద్ర‌బాబు ముద్దుల కుమారుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ లేన‌ట‌! ఈ ఇద్ద‌రు వ‌యో భేదం, సీనియార్టీ తేడాలు, చుదువులో తేడాలు వంటి వేమీ మ‌న‌సులో పెట్టుకోకుండా పార్టీని అభివృద్ధి ప‌థంలో దూసుకుపోయేలా చేస్తున్నార‌ట‌.

క‌ళా వెంక‌ట్రావు టీడీపీలో చాలా సీనియ‌ర్ నేత‌. ఆయ‌న‌కు పార్టీలో మంచి ప‌ట్టుంది. ఇక‌, నారా లోకేష్ 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయినా కూడా ఆయ‌న పార్టీ సభ్య‌త్వాన్ని ప‌రుగులు పెట్టించ‌డంలోను, పార్టీని సామాన్య ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలోను త‌న‌దైన వ్యూహంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక‌, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడుగా ఉన్న క‌ళా.. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్‌లు ఇద్ద‌రూ కూడా పార్టీని సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్తున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు.

ఈ ఇద్ద‌రు ఎలాంటి ఇగోల‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా టీడీపీ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యంగా విప‌క్ష వైసీపీని మ‌ట్టుబెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నార‌ట‌. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌రుస పెట్టి నేత‌లు క్యూక‌ట్ట‌డ‌మేన‌ని అంటున్నారు నేత‌లు. అంతేకాకుండా, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌చ్చిక చేసుకోవ‌డంలో పెద్ద ఎత్తున వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే పార్టీకి భారీ ఎత్తున స‌భ్య‌త్వం కూడా చేకూరింద‌ని అంటున్నారు. పైకి మాత్రం ఈ ఇద్ద‌రు నేత‌లూ ఎంతో సైలెంట్‌గా ఉంటూనే పార్టీకి మాత్రం ఎన‌లేని సేవ‌లు అందిస్తున్నార‌ట‌. దీంతో చంద్ర‌బాబు సైతం ఈ ఇద్ద‌రు నేత‌ల ప‌ట్ల ఎంతో మ‌క్కువ‌గా ఉన్నార‌ని స‌మాచారం.