క‌మ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. చూడాల‌ని ఉంద‌నేవాళ్లు కూడా కోట్ల‌లోనే

ఎప్పుడూ త‌న‌కు రాజ‌కీయాలు ప‌డ‌వ‌ని, పెద్ద‌గా వాటి గురించి కూడా మాట్లాడ‌బోన‌ని చెబుతూ ఉండే లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తాజాగా రాజ‌కీయ అరంగేట్రానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడ‌ట‌! త‌మిళ‌నాడులో ఇప్పుడు ఏర్ప‌డిన పొలిటిక‌ల్ గ్యాప్ త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని ప‌లువురు ఇచ్చిన స‌ల‌హా నేప‌థ్యంలో క‌మ‌ల్ ఇప్పుడు పొలిటిక‌ల్ డెసిష‌న్ తీసుకున్నాడ‌ని స‌మాచారం. వాస్త‌వానికి త‌మిళ‌నాడులో మాజీ సీఎం జ‌య‌లలిత‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డ క‌మ‌ల్‌.. ఆమెకు వ్య‌తిరేకంగా మాట్టాడి సంచ‌ల‌నం సృష్టించారు.

ఆమె మ‌ర‌ణం అనంత‌రం సీఎం సీటు కోసం జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో శ‌శిక‌ళ సీఎం కావ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించాడు. అదేస‌మ‌యంలో ప‌న్నీర్ సెల్వం కొన‌సాగింపున‌కు సినీ ఇండ‌స్ట్రీ నుంచి జై కొట్టిన ఏకైక వ్య‌క్తి క‌మ‌లే. ఇక‌, ఆ త‌ర్వాత పొలిక‌ట‌ల్ అరంగేట్రం ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డిన ర‌జ‌నీకాంత్‌కి మీడియా ముఖంగానే జైకొట్టాడు క‌మ‌ల్‌. కానీ, అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ర‌జ‌నీ ఎందుకో వెనుక‌బ‌డి పోవ‌డం, తాను వ‌ద్ద‌నుకున్న శ‌శిక‌ళ బృంద‌మే అధికారంలోకి రావ‌డం వంటి నేప‌థ్యంలో ఇక తాను పూర్తిగా రాజ‌కీయంగా అడుగులు వేయాల‌ని క‌మ‌ల్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఆయ‌న త‌న అభిమానులు, కొంత‌మంది సీనియ‌ర్ లాయ‌ర్ల‌తోను చెన్నైలో భేటీ అయ్యార‌ట‌. ఈ సంద‌ర్భంగా వారితో ఏం మాట్లాడార‌నేది పైకి తెలియ‌క‌పోయినా.. ప్ర‌స్తుత రాజ‌కీయాల గురించే వారితో చ‌ర్చించార‌ని స‌మాచారం. ఇక‌, క‌మ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. చూడాల‌ని ఉంద‌నేవాళ్లు కూడా కోట్ల‌లోనే ఉన్నారు. అదేస‌మ‌యంలో కేంద్రం నుంచి కూడా క‌మ‌ల్‌కి స‌పోర్ట్ కూడా ల‌భిస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే క‌మ‌ల్ కొత్త పార్టీతో ముందుకు వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు.