టీఆర్ఎస్‌ ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్‌

వెండి తెర అద్భతం బాహుబ‌లి సినిమాకు, తెలంగాణ రాజ‌కీయాల‌కు చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉన్న‌ట్లు అనిపిస్తోంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే ఇలా అనిపించ‌క మాన‌దు మ‌రి! టీఆర్ఎస్‌లో ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీశ్‌రావు క్ర‌మ‌క్ర‌మంగా ప్రాధాన్యం కోల్పోతున్నారు. అంతేగాక క‌ష్ట‌కాలంలో పార్టీని త‌న భుజ‌స్కందాల‌పై మోసిన ఆయ‌న్ను.. మేన‌మామ కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెడుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యం తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లోనూ స్పష్టంగా క‌నిపించింది. బాహుబ‌లిలా వెన్నుపోటుకు గురైపోయేది హ‌రీశ్‌రావ్ అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ బాహుబ‌లి ఎవ‌ర‌ని టీడీపీ, కాంగ్రెస్ నేత‌ల‌ను అడిగితే వినిపిస్తున్న పేరు.. హ‌రీశ్‌రావు! ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేద‌ట‌. తెలంగాణ అసెంబ్లీలో స‌భావ్య‌వ‌హారాల మంత్రి హ‌రీశ్ అయినా.. కీల‌క‌మైన అంశాలన్నింటిపై ఆయ‌న మాట్లాడింది చాలా త‌క్కువ‌. ప్ర‌తిప‌క్షాలు విసిరిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ మంత్రి కేటీఆర్ స‌మాధానం చెప్పుకుంటూ వెళ్లారు. సభా వ్యవహారాల మంత్రి హరీష్‌ రావు అయినప్పటికీ కీలకమైన అనేక అంశాలపై మంత్రి కేటీఆర్‌ దాదాపు అధికార హోదాలో జవాబివ్వడం, దాడి చేయడం పదే పదే జరిగింది.

కీల‌క‌మైన ప్రాజెక్టులకు సంబంధించిన కాంగ్రెస్‌ ఆటంకాలపై హరీశ్‌కూడా మాట్లాడినా అందులో పదును అంతగా లేదు. మరోవైపు కేటిఆర్‌ మాత్రం మాటిమాటికీ చర్చల్లో తలదూర్చి స‌మాధానాలు ఇచ్చుకుంటూ వెళ్లారు. హరీశ్‌రావ్‌ మాట్లాడిన సందర్భాల్లో కూడా కేటీఆర్‌ను ప్రస్తావించిన పరిస్థితి. ఇంకో వైపున కెసిఆర్‌ మామూలుకుంటే ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల కూడా శాఖామంత్రికి పనిలేకుండా పోయింది. ఇలా సభను తండ్రీకొడుకులే హైజాక్‌ చేసేస్తుంటే హరీష్‌ రావు ఏమనలేని ఇరకాటంలో పడిపోయార‌ట‌.

కుమారుడికే వారసత్వం అనుకున్నా తనకు కూడా సముచిత స్థానం లేకపోతే ఎలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. వీట‌న్నింటికీ తోడు కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఆయ‌న్ను చూసి.. బాహుబలి వస్తున్నాడంటూ సెటైర్లు వేస్తుండ‌టంతో మ‌రింత మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌. నిర్ణయాత్మక అధికారం ఇవ్వకుండా పైపై వ్యవహారాలతో సరిపెట్టడానికి ముఖ్యమంత్రి కుటుంబం చాలా వ్యూహాత్మకంగా ఉండాల్సి వ‌స్తోంద‌ట‌. మొత్తానికి పార్టీలో స‌మ‌స్య‌ల‌ను త‌న వ్యూహాల‌తో ప‌రిష్క‌రించిన హ‌రీశ్‌రావుకు ఇది నిజంగా గ‌డ్డుకాల‌మ‌నే చెప్పాలి!!