చంద్ర‌బాబు రాజీ చేసినా తీరు మారని నాయకులు … తక్షణం కర్తవ్యం?

ఏపీలో అధికార టీడీపీకి నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్న‌మాటే గాని చంద్ర‌బాబుకు నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ర్దుబాటుతోనే స‌గం కాలం గ‌డిచిపోతోంది. టీడీపీ వ‌ర్సెస్ టీడీపీ నాయ‌కుల‌తో పాటు టీడీపీ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం బీజేపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచి చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతోన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావుతో పాటు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు మ‌ధ్య గ‌త ఎన్నిక‌ల నుంచే అస్స‌లు పొస‌గ‌డం లేదు.

2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి బాపిరాజు టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తులో భాగంగా ఇక్క‌డ నుంచి పోటీ చేసిన మాణిక్యాల‌రావు విజ‌యం సాధించ‌డంతో పాటు ఏకంగా చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. బాపిరాజు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ అయ్యారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రు తాడేప‌ల్లిగూడెంలో ఆధిప‌త్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు.

చంద్ర‌బాబు సైతం ఈ విష‌యంలో ఎన్నోసార్లు రాజీ చేసినా వీరి తీరు మాత్రం మారలేదు. తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. నియోజ‌క‌వ‌ర్గంలోని పెద‌తాడేప‌ల్లి మేక‌ల సంత వ్య‌వ‌హారంలో స్టార్ట్ అయిన గొడ‌వ ర‌చ్చ ర‌చ్చ‌గా మారి అది చివ‌ర‌కు మంత్రి వ‌ర్సెస్ జ‌డ్పీచైర్మ‌న్ మ‌ధ్య వార్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే చైర్మ‌న్ బాపిరాజు తాను దయాదాక్షిణ్యాలతో గెలిచానంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఖండించారు. ఛాలెంజ్‌లు చేస్తే ఎవ‌రైనా స‌హించేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కేంద్రంలోని అమిత్‌షా, రాష్ట్రంలో చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో తాను పోటీ చేశానని అంతే తప్పా ఇక్కడి ఎవరి దయాదాక్షిణ్యాలు తనపై లేవన్నారు. జిల్లా పరిషత్‌తో పాటు, ఎమ్మెల్యేను కూడా ప్రజలే నెగ్గిస్తారన్న విషయాన్ని బాపిరాజు గుర్తించాలన్నారు. తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలో మిత్ర‌ధ‌ర్మానికి భంగం క‌లిగించేలా బాపిరాజు వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని మంత్రి మండిప‌డ్డారు. కాగా అంత‌కు ముందు బాపిరాజు మంత్రిని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు. ఫైన‌ల్‌గా గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుకోసం ఇటు బాపిరాజు, అటు మంత్రి ట్రై చేస్తుండ‌డంతోనే వీరి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు ఇప్ప‌ట్లో ఫుల్‌స్టాప్ ప‌డే అవ‌కాశం లేదు.