ప‌ద్మ‌వ్యూహంలో పవన్ …. ఇదంతా వ్యూహాత్మ‌క‌మే

వ్యూహ‌ర‌చ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన నేత మ‌రెవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదేమో! ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేలా ప్ర‌ణాళిక‌లు వేయ‌డంలో దిట్ట! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించు కోవాల‌నే ఆశ‌యంలో అడుగులేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు చెక్ చెప్పేలా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప‌వ‌న్ ఒంట‌రిగా రంగంలోకి దిగుతున్న నేప‌థ్యంలో.. ప‌వ‌న్ చుట్టూ ఒక వ్యూహాత్మ‌క వ‌ల‌ను ప‌న్నుతున్నారు. ఇక ప‌వ‌న్ ఎటువైపు వెళ్ల‌కుండా ర‌క్ష‌ణాత్మ‌క కంచె ఏర్పాటుచేస్తున్నారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రోసారి కీల‌క రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌వ‌న్‌.. ఈసారి ఒంట‌రిగానే రంగంలోకి దిగుతాన‌ని ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ కొంత ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వం మీద కొంత వ్య‌తిరేక‌త వ‌స్తున్న త‌రుణంలో.. ఇది వైసీపీకి ప్ల‌స్ కాకుండా ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు! ప‌వ‌న్ సేవ‌ల్ని మ‌రోలా ఉప‌యోగించుకునేందుకు కావాల్సిన వ్యూహర‌చ‌న జ‌రుగుతోందా అనే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. తాజాగా ఇలాంటి వ్యూహాత్మ‌క శ‌క్తులే ప‌వ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి వంత‌పాడే మీడియా ఇప్పుడు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లను దృష్టిలోపెట్టుకుని ఇప్ప‌టి నుంచే స‌ద‌రు మీడియా వ‌ర్గం ఓ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. కాట‌మరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా కొంత‌మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. దాదాపు ఐదు పేజీల క‌వ‌ర్ స్టోరీతో ఒక ప్ర‌ముఖ మీడియా ఆదివారం అనుబంధం నింపేసింది! ఇదంతా వ్యూహాత్మ‌క‌మే అనిపిస్తోంది.

ఇంకోప‌క్క‌.. ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం ఎటువైపు మొగ్గుతుంద‌నేది కూడా కీల‌క‌మే! వీరిలో టీడీపీ వ్య‌తిరేక ఓటు.. జ‌గ‌న్‌కు అనుకూలంగా మార‌కుండా అడ్డుకోవాలి! సో… ఇలాంటి ల‌క్ష్యాలతోనే స‌ద‌రు వ‌ర్గం ఇప్పుడు ప‌వ‌న్‌వైపు చేరుతోంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. అయితే… ఇదంతా చంద్ర‌బాబు నాయుడు ప్రీప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతున్న‌ద‌నేది కొంద‌రి వాద‌న‌.

మొత్తానికి జ‌న‌సేన‌కు ప్రాధాన్య‌త పెంచ‌డం వెన‌క వీరి ప్రాథ‌మ్యాలు వేరుగా ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి కాట‌మ‌రాయుడిని ప‌క్కాగా త‌న ప‌ద్మ‌వ్యూహంలో ఇరికించేందుకు ఇప్ప‌టినుంచే బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న‌డంలో డౌటే లేదు!!