రాజ‌కీయ లెక్క‌లు మారాయి .. జ‌గ‌న్‌కు కొత్త ప్ర‌త్య‌ర్థి రెడీ

జిల్లాలో 40 ఏళ్లుగా ఓట‌మి అనే ప‌దం ఆ కుటుంబం విని ఎరగ‌దు. ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా, అధికారంలో ఉన్నా.. ప్ర‌తిపక్షంలో ఉన్నా.. విజ‌యం మాత్రం ఆ కుటుంబానిదే! ప్ర‌త్య‌ర్థులు కూడా ఆశ‌లు వ‌దులుకుని అక్క‌డ పోటీ చేయాల్సిందే! కానీ ఇప్పుడు క‌డ‌ప జిల్లాలో ప‌రిస్థితులు మారాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోట‌గా నిలిచిన చోట‌.. అదే కుటుంబం ఓట‌మి చ‌విచూసింది. అంతేగాక క‌డ‌ప జిల్లాలో వైఎస్ కుటుంబానికి స‌రికొత్త ప్ర‌త్య‌ర్థి తెర‌పైకి వ‌చ్చింది. ఇన్నాళ్లూ బ‌ద్ద‌లు కొట్ట‌లేని జ‌గ‌న్ కంచుకోట‌ను బీటెక్ ర‌వి బ‌ద్ద‌లు కొట్టాడు.

క‌డ‌ప అంటే వైఎస్ ఫ్యామిలీ…వైఎస్ ఫ్యామిలీ అంటే క‌డ‌ప‌. ఇదంతా నిన్న‌టి వ‌ర‌కే! నేడు అక్క‌డ రాజ‌కీయ లెక్క‌లు తారుమార‌య్యాయి. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా క‌డ‌పలో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ కంచుకోట దారుణంగా బ‌ద్ద‌లైంది. తాజాగా ప్రతీ క్షణం వెన్నులో వణుకు పుట్టించిన కడప ఎమ్మెల్సీ కౌంటింగ్ అంతే ఉత్కంఠ రేపుతూ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి విజయం కట్టబెట్టింది.

వైసీపీ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డిపై 33ఓట్ల మెజారిటీతో రవి విజయం సొంతం చేసుకున్నారు. కడప వైసీపీ అధినేత జగన్ సొంత గడ్డ కావడంతో అక్కడ గెలుపు టీడీపీకి అంతులేని ఆనందాన్నిచ్చింది. వైసీపీకి అంతే విషాదాన్ని మిగిల్చింది. తమకు మేలు చేస్తుందనుకున్న క్రాస్ ఓటింగ్ మంత్రం ఫలించకపోవడం వైసీపీని మరింత విషాదంలో ముంచెత్తింది. సొంత జిల్లాలోనే ఓడిపోవ‌డంతో వైసీపీ శ్రేణులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాయి! గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ 10 ఎమ్మెల్యేల‌కు కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే గెలిచింది. వైసీపీ 9 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలుచుకుంది.

ప్ర‌స్తుతం బీటెక్ రవి విజ‌యంతో క‌డ‌ప‌లో జ‌గ‌న్‌కు పోటీగా ప్ర‌త్య‌ర్థి సిద్ధ‌మయ్యాడ‌నే చ‌ర్చ మొద‌లైంది. ర‌వి విజ‌యం టీడీపీ శ్రేణుల్లో అమితోత్సాహాన్ని నింపింది. వైఎస్ జ‌గ‌న్‌కు ఇప్పుడు ఏదీ క‌లిసి రావ‌డం లేద‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో మొద‌లైంది. మ‌రి ఈ ఓట‌మి నుంచి జ‌గ‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో వేచిచూడాల్సిందే! పార్టీ శ్రేణుల‌కు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్య‌త ఇప్పుడు ఆయ‌నే మీదే ఉంది.