టీడీపీ 3 – వైసీపీ 0…. ఓట‌మి జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా పెద్ద దెబ్బే

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ త‌న దూకుడు చూపించింది. స్థానిక సంస్థ‌ల‌కు జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌, క‌ర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. శుక్ర‌వారం ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ అభ్య‌ర్థి ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. ఈ గెలుపుతో జిల్లా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 852 ఓట్లు ఉండ‌గా 851 ఓట్లు పోల‌య్యాయి.

ఇక క‌ర్నూలు జిల్లా విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ నుంచి టీడీపీ, వైసీపీ జిల్లా అధ్యక్షులే పోటీ ప‌డ‌డంతో పోటీ ఇక్క‌డ కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టీడీపీ అభ్య‌ర్థి శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ప్ర‌త్య‌ర్థి వైసీపీ అభ్య‌ర్థి గౌరు వెంక‌ట‌రెడ్డిపై 56 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ ఒకానొక ద‌శ‌లో వైసీపీ ఆధిక్యంలోకి వెళ్లినా చివ‌ర‌కు టీడీపీదే గెలుపు అయ్యింది.

క‌డ‌ప‌లో బ‌ద్ద‌లైన వైఎస్ ఫ్యామిలీ కంచుకోట :

ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిరేపిన క‌డ‌ప జిల్లాలో టీడీపీ రికార్డు విజ‌యం సాధించింది. ఇక్క‌డ గ‌త 40 యేళ్ల‌లో వైఎస్ ఫ్యామిలీకి ఎప్పుడూ ఓట‌మి లేదు. అలాంటిది ఆ ఫ్యామిలీకి చెందిన వైఎస్ .వివేకానంద‌రెడ్డి టీడీపీ అభ్య‌ర్థి బీటెక్ ర‌వి 33 ఓట్ల ఓట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక్క‌డ మొత్తం 839 ఓట్లు పోల‌య్యాయి. టీడీపీ అభ్య‌ర్థి ర‌వికి 436 ఓట్లు వ‌స్తే వైసీపీ అభ్య‌ర్థి వైఎస్‌.వివేక‌కు 403 ఓట్లు వ‌చ్చాయి. ఏదేమైనా ఇక్క‌డ ఓట‌మి జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా పెద్ద దెబ్బే.