`ఆప‌రేష‌న్ జ‌గ‌న్` అధికార పార్టీ వ్యూహం స‌క్సెస్‌

అనుకున్న‌దే అయింది! క‌థ అడ్డం తిరిగింది! అస‌లు విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టింది! ఇప్పుడే కాదు ప్ర‌తిసారీ అలానే జ‌రుగుతోంది! ప్ర‌తిప‌క్ష నాయకుడి వ్యూహం బెడిసికొట్టింది.. విష‌యం పైకి రాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని కార్న‌ర్ చేయ‌డంలో అధికార ప‌క్షం మ‌రోసారి విజ‌యం సాధించింది! అధికార ప‌క్షం అల్లిన ఉచ్చులో వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్స్ సంఘ‌ట‌న‌లో కీల‌కమైన విష‌యాలను ప్ర‌జ‌లు పట్టించుకోకుండా.. వారి ఫోక‌స్‌ అంతా జ‌గ‌న్‌పై ప‌డేలా చేయ‌డంలో సీఎం చంద్ర‌బాబు అండ్ కో మ‌రోసారి స‌క్సెస్ అయింది.

విశాఖలో విద్యార్థులు చేప‌ట్టిన ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపిన జ‌గ‌న్‌ను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేయడం.. అధికారుల‌తో వాగ్వాదం వంటివి మ‌రువక ముందే మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర ప్ర‌మాదంలో ప‌ది మంది మృత్యువాత ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన జ‌గ‌న్‌తో క‌లెక్ట‌ర్ వాగ్వాదం.. జ‌గ‌న్‌పై ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ పోలీసుల‌కు ఫిర్యాదు చెయ్య‌డం అన్నీ నాట‌కీయంగా జ‌రిగిపోయాయి. ఇప్పుడు జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

బాధితుల‌ను జ‌గ‌న్ ప‌ర‌మార్శించిన రోజు ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు! కానీ24 గంట‌లు గ‌డిచిన త‌రువాత అంద‌రూ జ‌గ‌న్‌పై కేసు గురించే మాట్లాడుతున్నారు. సీఎంతో స‌హా అంద‌రూ జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్‌కు జైలు జైలు అని క‌ల‌వ‌రిస్తున్నార‌ని, సెంట్ర‌ల్‌జైలుకు వెళ్లాల‌ని తొంద‌ర‌ప‌డుతున్నార‌ని సీఎం ఎద్దేవా చేస్తే, జ‌గ‌న్ గ్యాంగ్ లీడర్ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు వీటిపై కౌంట‌ర్‌గా వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఘాటుగానే స్పందించి విమ‌ర్శ‌లు చేశారు! రెండు పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ప్రారంభ‌మైంది. మీడియా కూడా ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు, బ‌స్సు సంస్థ గురించి చెప్ప‌డం మాని.. ఈ మాట‌ల యుద్ధం పైనే ఫోక‌స్ చేస్తోంది.

తెలుగుదేశం కోరుకున్న‌ది ఇదే! అధికార పార్టీ వ్యూహం కూడా ఇదే! ఆ వ్యూహంలో వైకాపా చక్క‌గా చిక్కుకుంది. ఇంత‌కీ ఆ వ్యూహం ఏంటంటే… ప్ర‌మాదానికి గురైన బ‌స్సు టీడీపీ నాయ‌కుడి కుటుంబానికి చెందిన సంస్థ‌ది క‌దా! కాబ‌ట్టి, ప్ర‌మాదం గురించి మీడియా ఫోక‌స్ చెయ్య‌కుండా ఉండాలంటే అంత‌కంటే పెద్ద‌దైన టాపిక్ తెర‌మీదికి రావాలి. అప్పుడు మీడియా ఫోక‌స్ అంతా అటువెళిపోతుందనేది వ్యూహం. ఇప్పుడు అదే జ‌రిగింది. జ‌గ‌న్‌పై కేసు, విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లే త‌ప్ప‌.. ప్ర‌మాద కార‌ణాల‌పై లోతైన విశ్లేష‌ణ‌ల‌కుగానీ అవ‌కాశం లేకుండా చేశారు.