అందరి లెక్క స‌రిజేస్తున్న కేసీఆర్‌

త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేస్తూ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు అంద‌రి లెక్క‌లు స‌రిచేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో… టీఆర్ఎస్‌ను తిరుగులేని శ‌క్తిగా.. మార్చ‌డంతోపాటు.. అన్ని వ‌ర్గాల‌ను పార్టీ వైపే ఉండేలా చేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. కేసీఆర్ క్యాస్ట్ ఈక్వెష‌న్స్ గురించి తెలిసిన వారు `ఔరా` అన‌క మాన‌రంటే అతిశ‌యోక్తి కాదేమో!! క‌మ్మ‌, రెడ్డి, బీసీ, బ్రాహ్మ‌ణ‌, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ ఇలా అన్ని వ‌ర్గాల‌కు చేరువ‌య్యేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు అమ‌లుచేస్తున్నారు.

ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ కుల ఫార్ములాల ప్రయోగాలు బాగా పెంచేశారు. గతంలో తెలంగాణలో రెడ్ల పాలన నడిచిందని ఇప్పుడు వెలమల ఆధిపత్యం వచ్చేసిందని అంతా భావిస్తున్న స‌మ‌యంలో.. అప్పుడు రెడ్ల వెనక వుండి చక్రం తిప్పింది వెలమలే చూడండి అని ఇటీవల ఒక టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధి ఉదాహరణలు చెప్పారు! అలాగే క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని కూడా కలిపేసుకోవడం పెద్ద పనికాదు. రెడ్లను కలుపుకున్నా.. శక్తియుక్తులు గల వారిని మరీ కీలక స్తానాల్లోకి తీసుకోకూడదు. కాస్త మందకొడిగా లేక విధేయంగా ఉండేవారిని చేరదీసి వారికీ ఇచ్చామనిపించాలి. అదీ స్టోరీ. ఇక బీసీలను ఆకట్టుకోవడోనికి రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఆ సామాజిక‌వ‌ర్గ నాయకులు ప్రముఖులుగా మారారు.

మరోవైపు కురుమ (అంటే కేవలం గొర్రెలు మేకలే మేపు కునేవారు) ముదిరాజ్‌(మత్స్యకారులు), నాయీ బ్రాహ్మల వంటి వారు ఉపేక్షకు గుర‌య్యారు. కానీ వారు త‌మ వైపే ఉండిపోతార‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక బ్రాహ్మణుల‌ను ఆక‌ట్టుకునేందుకు పరిషత్‌ ఏర్పాటు చేయడమే గాక ఆంధ్ర తెలంగాణ తేడాలు కూడా పాటించకుండా సలహాలు సహాయం తీసుకుంటామన్నారు. సంప్రదాయాలను పాటించే కేసీఆర్‌ స్వతహాగా వీరితో మంచిగా ఉండాలను కుంటారట. పైగా వారివల్ల పెద్ద ప్రమాదం లేదని కొంచెం చేస్తే కొండంత సంతోషపడతారని భావిస్తున్నార‌ట‌.

ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ముస్లింలు ఎస్‌సిలు ఓటు వేసే సమయానికి ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారని సంప్రదాయికంగా వారికి కొన్ని రివాజులున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనా ఆయనకు పెద్ద ఆసక్తి లేదు. అప్ప‌టికి వారికి అవ‌స‌ర‌మైన ప‌థకాలు ప్ర‌వేశ‌పెట్టి వారినీ త‌ను అనుకూలంగా మార్చుకుంటార‌ని చెబుతున్నారు. మరి కేసీఆర్ అన్ని సామాజిక‌వ‌ర్గాల ప్ర‌జ‌ల లెక్క‌ను స‌రిజేస్తున్నార‌న‌డంలో సందేహం లేదు!!