ఏపీ రాజ‌కీయాల్లో మూడు ముక్క‌లాట‌

అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జ‌ర‌గ‌నుంది. అనుభ‌వ‌జ్ఞుడిగా పేరున్న చంద్ర‌బాబుకు.. న‌వ్యాంధ్ర‌ను పునాదుల నిర్మించే అవ‌కాశాన్ని ఏపీ ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాల‌నే పట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని దృఢ నిశ్చ‌యంతో ఉన్నాడు. దీనికి తోడు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయ‌గ‌లగ‌డంతో ఎవ‌రికి వారు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. రెండేళ్ల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఏ అంశాలు క‌లిసివ‌స్తాయో ఓ లుక్కేద్దాం!!

అపారమైన రాజకీయ అనువభం గ‌ల చంద్ర‌బాబు మాత్ర‌మే ఏపీని నిల‌బెట్ట‌గ‌ల‌ర‌ని నమ్మి ప్ర‌జ‌లు టీడీపీని గెలిపించారు. నిధుల కొరత, కేంద్ర సహాయ నిరాకరణ వంటి సమస్య‌లున్నా ఏపీకి ఒక రూపు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులు, 24గంటల విద్యుత్, ఇలా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ ఆకర్షిస్తున్నారు. అయితే మంత్రుల అవినీతి, కాపుల రిజ‌ర్వేష‌న్లు. రుణ‌మాఫీ అంశాల్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. అదే సమయంలో నాయకుల అవినీతి, క్రమశిక్షణారాహిత్యం, మంత్రుల పనితీరు ఇప్పుడు ఆయ‌న్ను వెనక్కులాగుతోంది, ఈ విషయాలు ఎలా ఉన్నా పనిచేసే సీఎం గా పేరుండ‌టం ఆయనకు శ్రీరామరక్ష!!

ఇక బాబుకు ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గ‌ట్టిపోటీదారు. రోజు రోజుకు ఆంధ్రాప్రజలకు చంద్రబాబుపై ఉన్న భ్రమలు వీడిపోతున్నాయని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. ప్ర‌స్తుతం హోదా విష‌యంలో జ‌గ‌న్ దూకుడుగా వ్య‌వ‌హరిస్తుండ‌టం కొంత లాభించే అంశ‌మే!! అయితే పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జ‌గ‌న్‌కు ఇబ్బందులు తీసుకొస్తోంది, ఎవ‌రు ఎప్పుడు పార్టీలో ఉంటారో.. ఎవ‌రు ఉండ‌రో తెలియ‌ని స్థితి! కేసుల విష‌యంలో ఇప్పటిదాకా కేంద్రం త‌న‌కేసుల‌ను వాయిదా వేయిస్తూ ఉండడంతో కొంత ఊపిరిపీల్చుకోగలుకుతున్నారు. ఒక‌వేళ బాబు ఒత్తిడితో కేంద్రం.. వీటిని తిర‌గ‌తోడితే ఇక జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు!

ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీ-బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ సినీ నటుడు,జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అమితుమీకి సిద్ధ‌మ‌య్యాడు, 2014లో కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన ఆయ‌న‌.. 2019లో సొంతంగా పోటీకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు, ప్రస్తుతం హోదా విషయంలో.. టీడీపీ-బీజేపీతో నేరుగా పోటీకి దిగాడు, అలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరు స‌లుపుతూ,, ప్ర‌జ‌ల్లోకి కూడా దూసుకెళుతున్నాడు. క్రేజ్‌ ఉన్న పవన్‌ రంగంలోకి దిగితే ఆయన సామాజికవర్గం, కమ్యూనిస్టులు, లోక్‌సత్తా మ‌ద్ద‌తు ఉండనే ఉంది. అలాగే రాబోయే ఎన్నిక‌ల‌కు బ‌ల‌మైన నేత‌గా ఎద‌గ‌గ‌ల‌డు!!