ఎంవోయూల‌తో హోదా ఉద్య‌మానికి బాబు బ్రేక్‌

భాగ‌స్వామ్య స‌దస్సు ద్వారా రూ.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించాలనేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం `ఇదీ ఆ సద‌స్సు ముందు మంత్రులు చెప్పిన మాట‌! `భాగ‌స్వామ్య స‌దస్సులో రూ.10.5ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి` ఇదీ ప్ర‌భుత్వ లెక్క‌! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 ల‌క్ష‌ల కోట్లు అద‌నంగా వ‌చ్చాయి! ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఈ లెక్క‌ల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉంద‌ట‌. హోదా కోసం యువ‌త విశాఖ‌ ఆర్‌కే బీచ్‌లో ఉద్య‌మించిన త‌ర్వాతి రోజే అదే న‌గ‌రంలో భాగ‌స్వామ్య స‌ద‌స్సు ప్రారంభ‌మవ‌డ‌మే ఈ లెక్క‌ల్లో మార్పుల‌కు కార‌ణ‌మని స‌మాచారం!!

భాగ‌స్వామ్య స‌ద‌స్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబ‌డుల వ‌ర‌ద పారుతోంద‌ని ఒక‌ప‌క్క ప్ర‌భుత్వం ఊద‌ర‌గొడుతోంది, ముఖ్యంగా రెండు రోజులు జ‌రిగిన స‌దస్సులో ఏకంగా రూ,10.5ల‌క్ష‌ల కోట్ల విలువైన పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని. వీటి ద్వారా 22ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది, ఇది భారీ విజ‌య‌మ‌ని ప్ర‌భుత్వం ప్ర‌చారం మొద‌లుపెట్టేసింది, అయితే ఇది ప్ర‌చార ఆర్భాట‌మేన‌ని కొన్ని వ‌ర్గాల స‌మాచారం. ఎందుకంటే ఉమ్మ‌డి ఏపీలో హైదరాబాద్ వంటి అన్ని వసతులు గ‌ల న‌గ‌రం ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన ఎంవోయూల విలువ రూ. 6.47 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే!!

మ‌రి ఇప్పుడు న‌వ్యాంధ్ర‌లో అంత‌టి అద్భుత న‌గ‌రం లేదు!! పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి కాలేదు! మరి ఈ స‌మ‌యంలో ప‌దిన్నర లక్షలకోట్ల పెట్టుబ‌డులు ఎలా వస్తాయ‌నేది ప్ర‌శ్న‌! అయితే ఈ లెక్క‌ను అప్ప‌టిక‌ప్పుడు పెంచేశారా? అంటే అవున‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే హోదా ఉద్య‌మం ఊపందుకుంది. అది కూడా విశాఖ వేదిక‌గా నిర‌స‌న తెలియ‌జేసేందుకు యువ‌త నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు ఉద్య‌మాలు చేస్తే రాష్ట్రానికి వ‌చ్చే పెట్టుబ‌డులు పోతాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది, దీంతో హోదా ఉద్య‌మాన్ని క‌ప్పి పుచ్చేందుకు రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని ప్ర‌చారం చేసేందుకు ఒక్క‌సారిగా ఈ విలువ‌ను పెంచి క‌ల‌రింగ్ ఇచ్చార‌ట‌.

ప్ర‌స్తుతం కొత్త ఎంవోయుల్లో చెప్పుకోదగ్గ కంపెనీల పేర్లు కొన్నే. అందులో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులే దాదాపు రూ,2ల‌క్ష‌ల కోట్లు ఉన్నాయి ఇవి ఏ మేరకు అమలు అవుతాయో గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో కార్యకలాపాలు నడుపుతూ ఉద్యోగులకు జీతం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ఓ ఐటీకంపెనీ తాజాగా ఏపీలో ఎంవోయూ కుదుర్చుకోవటం ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశ‌మే!! ఈ విష‌యంలో చంద్ర‌బాబు మ‌రోసారి త‌న చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించారు. ఎంవోయుల సంఖ్య పెంచి రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు క్యూ క‌డుతున్నాయ‌నేలా చేసి హోదా కోసం పోరాడే వారికి త‌గిన స‌మాధానం చెప్పాల‌నే ల‌క్ష్యం పూర్తిచేశారు!!