జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చు బిగిస్తోందెవ‌రు..!

నోరా.. వీపుకు చేటు! అనేది ఓ పాత సామెత‌. అంటే.. మ‌నం నోటిని ఎంతో అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే.. లేని పోని చిక్కులు వ‌చ్చిప‌డ‌తాయ‌ని అర్ధం. ఇప్పుడు ఈ మాట వైకాపా అధినేత జ‌గ‌న్ విష‌యంలో అక్ష‌ర స‌త్యం అవుతోంది! గ‌తంలో ఓదార్పు యాత్ర‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడిన జ‌గ‌న్‌కు కేసుల రూపంలో ఎదురైన అనుభ‌వం ఈ జీవిత‌కాలం కోర్టుల‌తో పోరాడినా స‌మ‌సిపోని చిక్క‌లు తెచ్చింది. అంతేకాదు, సీబీఐ, ఈడీల రూపంలో జ‌గ‌న్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

అక్ర‌మమో.. స‌క్ర‌మ‌మో.. ఏ కోర్టులూ తేల్చ‌కుండానే రూ.వంద‌ల కోట్ల ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసేసింది. ఇది గ‌తం! తాజా విష‌యానికి వ‌స్తే.. ఏమైందో ఏమో.. కేసులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. విచార‌ణ‌లు కూడా వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్నాయి. దీంతో కొంత మేర‌కు జ‌గ‌న్ ఊపిరి పీల్చుకుని పార్టీ వ్య‌వ‌హార‌ల‌పై దృష్టి పెడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా వెల్లువెత్తిన పెద్ద నోట్ల ర‌ద్దు క‌ష్టాల‌పై త‌న‌దైన స్టైల్లో విరుచుకుప‌డ్డాడు. అయితే, ఆచితూచి మాట్లాడాల్సిన జ‌గ‌న్‌.. బీజేపీపై మాట‌ల యుద్ధం చేశాడు. ఈ ప‌రిస్థితి ఎక్క‌డా ఉండ‌ద‌ని అన్నాడు.

పెద్ద నోట్ల ర‌ద్దును స‌మ‌ర్ధిస్తూనే.. చిల్ల‌ర కొర‌త‌పై క‌దం తొక్కాడు. ఈ మాట‌ల యుద్ధం పుణ్య‌మో ఏమో తాజాగా.. త‌మ అధీనంలో ఉన్న జ‌గ‌న్ ఆస్తులు రూ.177 కోట్ల‌ను సొంత అకౌంట్ల‌లోకి మ‌ళ్లించేసుకుంది ఈడీ! ఇప్పుడు ఈ విష‌యంపైనే రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. జ‌గ‌న్ మాట‌ల‌కు మండే.. బీజేపీ ఉచ్చు బిగిస్తోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఓటుకు నోటు విష‌యంలో వైకాపా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే హైకోర్టులో కేసు వేయ‌డం…దానికి జ‌గ‌న్ ఫుల్ సపోర్ట్ చేసి కెలుక్కోవ‌డం కూడా చంద్ర‌బాబుకు చిర్రెత్తుకొచ్చి…బాబు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జ‌గ‌న్ కేసుల‌ను తిర‌గ‌దోడిస్తున్నార‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

మ‌రికొంద‌రు టీడీపీ, బీజేపీలు కావాల‌నే జ‌గ‌న్‌ను ఇప్పుడు మ‌రోసారి ఇరుకున‌పెడుతున్నార‌ని అంటున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రో విచిత్ర ఘ‌ట‌న ఏంటంటే.. గ‌తంలో జ‌గ‌న్ ఎప్పుడు కోర్టును ఆశ్ర‌యించినా విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తులు .. తాజా ఘ‌ట‌న‌లో జ‌గ‌న్ ఇచ్చ‌న హౌస్ మోష‌న్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించారు. ఏదేమైనా.. జ‌గ‌న్‌కి ఉచ్చు బిగిస్తోంద‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు క‌దా!! మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న మాట‌ల‌ను అదుపులో పెట్టుకుంటాడో లేదో చూడాలి.