ప‌వ‌న్ మూడో స‌భ‌లో ఆయ‌నే టార్గెట్‌..!

జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత బ‌హిరంగ స‌భ‌పై ప్ర‌జ‌ల్లో ఆశ‌లు పెరిగాయి. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోస‌మే త‌న పోరు సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ సారి ఎవ‌రిని టార్గెట్‌గా చేసుకుంటారో? ఎవ‌రిమీద పంచ్‌లు విసురుతారో? అని స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి అంచ‌నాలు, లెక్క‌లు వాళ్లు వేసుకుంటున్నారు. వ‌ప‌న్ నిర్వ‌హించే స‌భ‌ల‌కు ఓ ప్ర‌త్యేకత కూడా ఉంది. ఎక్క‌డా సోది లేకుండా చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సూటిగా చెప్పేస్తారు. విమ‌ర్శించాల‌ని అనుకుంటే అవ‌త‌లివాళ్లు ఎలాంటి వాళ్ల‌యినా స‌రే దుమ్ముదులిపేయ‌డం ప‌వ‌న్ స్టైల్‌.

గ‌తంలో తిరుప‌తి వేదిక‌గా అనూహ్యంగా నిర్వ‌హించిన తొలి స‌భ‌లో ఏపీ ప్ర‌త్యేక హోదా పై గ‌ళం విప్పిన ప‌వ‌న్‌.. హోదా ఇస్తామ‌ని, తెస్తామ‌ని 2014 ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ విష‌యంలో టీడీపీ స‌హా అంద‌రూ హామీ ఇచ్చార‌ని, దీనిని నెర‌వేర్చి తీరాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌త్యేక హోదాను అడుక్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, అది ఆంధ్రుల హ‌క్క‌ని స్ప‌ష్టం చేశారు. ఈవిష‌యంలో కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వ్యాఖ్య‌లు త‌న‌ను బాధించాయ‌ని ముగ్గురు సీఎంలు అడ్డుప‌డుతున్నారంటూ అశోక్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని స్ప‌ష్టం చేశారు. ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌న‌మే ప్ర‌ధాన‌మ‌ని చెప్పారు.

ఇక‌, కాకినాడ వేదిక‌గా నిర్వ‌హించిన రెండో స‌భ‌లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదాన్ని తెర‌మీద‌కి తెచ్చిన ప‌వ‌న్‌.. ఆనాడు ఇదే అంశంపై కేంద్రం మంత్రి వెంక‌య్య నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌ను దుయ్య‌బ‌ట్టారు. ఒక ర‌కంగా ప్ర‌త్యేక ప్యాకేజీని పాచి పోయిన ల‌డ్డూలుగా పేర్కొంటూ.. వెంక‌య్య‌పై దుమ్మెత్తిపోశాడు. ఇక‌, ఇప్పుడు తాజాగా నిర్వ‌హించ‌నున్న అనంత స‌భ‌లో ఎవ‌రిని టార్గెట్ చేస్తాడ‌నే అంశంపై ఊహాగానాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప‌వ‌న్ ఈ ద‌ఫా టార్గెట్ చేస్తార‌ని అంటున్నారు. త‌న పంచ్‌ల‌తో మోడీపై విరుచుకుప‌డ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం ప‌వ‌న్ చేసిన‌ట్టే. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ నేతా కూడా నేరుగా మోడీని విమ‌ర్శించ‌లేదు. సో.. ప‌వ‌న్ కామెంట్లు ఎలా ఉంటాయ‌నే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ స‌స్పెన్స్‌కి త‌ర‌ప‌డాలంటే న‌వంబ‌ర్ 10వ‌ర‌కు వేచి ఉండ‌క త‌ప్ప‌దు!