2019 ఎల‌క్ష‌న్స్‌కు జ‌గ‌న్ షాకింగ్ యాక్ష‌న్ ప్లాన్‌

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా విజ‌యం మాదే అని ప‌దేప‌దే చెప్పే జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని కూడా చెబుతుంటారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తుంటారు. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. 2014లోనే ఏపీలో అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ఎంతో ప్ర‌యాస ప‌డ్డారు. అయినా ప్ర‌జ‌లు బాబు వైపే మొగ్గు చూపారు. ఇక‌, ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ క‌న్నేశారు. ఎట్టిప‌రిస్థితిలోనూ ఆ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించారు. అటు ఆర్థికంగా, ఇటు కేసు ప‌రంగా దేనిని ఎదుర్కొనాల‌న్నా ఆయ‌న‌కు 2019లో అధికారం త‌ప్ప‌నిస‌రిగా మారింది.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టికే ఓ యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేశారు. జిల్లాలు, మండ‌లాల స్థాయిలో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? ఇప్పుడున్న నేత‌లు ఎలా ప‌ని చేస్తున్నారు? అధిష్టానం ఆదేశాల‌ను ఏ విధంగా అమ‌లు చేస్తున్నారు? ప‌్ర‌జ‌ల్లో ఎంత వ‌ర‌కు ఉంటున్నారు?  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఎలా స్పందిస్తున్నారు? వ‌ంటి అనేక విష‌యాలపై అంత‌ర్గ‌తంగా జ‌గ‌న్ పెద్ద ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. 2019లో విజ‌యం సాధించాలంటే ఇప్పుడు న్న ఎమ్మెల్యేలు ఎంత మేర‌కు స‌రిపోతారు వంటి విష‌యంపైనా జ‌గ‌న్ దృష్టి పెట్టారు. ఇటీవ‌ల ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన గ‌డ‌గ‌డ‌ప‌కు వైసీపీ ఎంత వ‌ర‌కు విజ‌యం సాధిస్తోందో కూడా ఆయ‌న తెలుసుకోవాల‌నుకున్నారు.

ఈ నేప‌థ్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గ, మండల స్థాయిలో వైసీపీ వాలంటీర్ల పేరిట కొందరు వ్యక్తులను నియ‌మించారు. వీరంతా పార్టీకి అత్యంత న‌మ్మ‌క‌స్తులు. విధేయులు కూడా! అంతేకాదు, వీరికి పార్టీతో అంత‌ర్గ‌త సంబంధాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. రెండు నెల‌ల కింద‌టే ప్రారంభ‌మైన ఈ ప్ర‌క్రియ‌లో వాలంటీర్ల‌కు చంద్ర‌గిరి ఎమ్మెల్యే, వైకాపా ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి నేతృత్వంలో శిక్ష‌ణ కూడా ఇచ్చార‌ట‌! ఇక‌, వీరంతా వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల కదలికలు, పార్టీలో పనితీరుపై నిఘా పెడ‌తారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో రోజువారీ రిపోర్ట్‌లు త‌యారు చేస్తారు. వీటిని ఏరోజుకారోజే అధిష్టానానికి పంపిస్తారు.

ఈ రిపోర్టులను జ‌గన్  ప‌రిశీలించ‌డంతోపాటు నేరుగా జోక్యం చేసుకుని తేడాగా ఉన్న‌ సంబంధిత ఎమ్మెల్యే లేదా నాయకులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి, తగు సూచనలివ్వడం లేదా వివరణ కోరడం వంటి ప్రక్రియ చేపడుతున్నారని సమాచారం. దీని ఆధారంగా 2019 ఎన్నిక‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఎలా దూసుకుపోవాలి అనే విష‌యాల‌పై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తాడ‌ని స‌మాచారం. ఇక‌, అధికార టీడీపీపై ప్ర‌త్యేక హోదా పోరు సాగుతుంద‌ని అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అంటే వీరు రానున్న రోజుల్లో మ‌రింత పోరుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.