న‌యీం పేరుతో ఎమ్మెల్యే దందా

ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వ‌ర‌కు త‌న మాట విన‌ని వాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించిన గ్యాంగ్ స్ట‌ర్ న‌యీంను పోలీసులు అంత‌మొందించినా.. అత‌ని తాలూకా అనుచ‌రుల ఆగ‌డాల‌కు మాత్రం చెక్ పెట్ట‌లేక‌పోతున్నారు. నయీంతో అంట‌కాగిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంకా ఇప్ప‌టికీ దందాలు సాగిస్తూనే ఉన్న‌ట్టు ప‌క్కాగా సీఎం కేసీఆర్‌కే స‌మాచారం అందిందంటే ప‌రిస్థితి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. న‌యీం అనుచ‌రులుగా చ‌క్రం తిప్పిన  శేషన్న, నయీం బంధువు ఖలీంలతో ఈ ఎమ్మెల్యే చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అంతేకాదు, వీటిని ఇంకా కొన‌సాగిస్తున్న‌ట్టు బాధితులు వెల్ల‌డించిన స‌మాచారాన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది.

తన నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల భూ లావాదేవీల్లో ఈ ఎమ్మెల్యే భారీ ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఎమ్మెల్యే.. శేష‌న్న‌, ఖ‌లీంల‌ను వినియోగించుకున్న‌ట్టు స‌మాచారం.. ఈ క్ర‌మంలో కొంద‌రిని బెదిరించి ఆగ‌డాలకు పాల్ప‌డుతున్న‌ట్టు బాధితులు నేరుగా సీఎం కేసీఆర్‌కే స‌మాచారం అందించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క‌సారిగా సీరియ‌స్ అయిన కేసీఆర్ విష‌యం తేల్చాల‌ని, ఎవ‌రు ఎంత‌టి స్థాయిలో ఉన్నా ఆగ‌డాలు చేస్తే.. ప్ర‌జ‌లను బెదిరిస్తే.. స‌హించేది లేద‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న విష‌యాన్ని తేల్చాల‌ని న‌యీం కేసులో ఇప్ప‌టికే విస్తృతంగా ప‌రిశోధ‌న చేస్తున్న సిట్‌ను ఆదేశించార‌ట‌.

 దీంతో సిట్ అధికారులు స‌ద‌రు ఎమ్మెల్యేపై దృష్టి పెట్టార‌ని స‌మాచారం. ఇక‌, క్షేత్ర‌స్థాయిలోనూ ఎమ్మెల్యేగారి దందాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని న‌ల్ల‌గొండ ఎస్పీని సిట్ కోరింది. దీంతో ఎస్పీ కిందిస్థాయి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయడంతో  సంస్థాన్ నారాయణ్‌పూర్ ఎస్సై విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి న‌యీం హ‌తం కావ‌డంతో అత‌ని అనుచ‌రులు చెట్టుకొక‌ళ్లు, పుట్ట‌కొక‌ళ్లు అన్న‌ట్టుగా ప‌రార‌య్యారు. అదేక్ర‌మంలో  శేషన్న, ఖలీంలు అజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం సిట్ గాలిస్తోంది. వారు కనుక దొరికితే ఆ ఎమ్మెల్యే బాగోతం బ‌య‌ట‌కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా. . న‌యీం పోయినా.. అత‌ను పెంచి పోషించిన మూక‌ల ఆగ‌డాలు ఇప్ప‌ట్లో స‌మ‌సేలా లేవు.