వంశీ నియోజ‌క‌వ‌ర్గంలో నెహ్రూ జోక్యం…బాబుకు కంప్లైంట్‌

ఒక ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వంటారు. ఇప్పుడు ఈ ప‌రిస్థితి కృష్ణాజిల్లా టీడీపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇద్ద‌రు ప్ర‌ధాన నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల తిర‌గి టీడీపీ సైకిలెక్కిన దేవినేని నెహ్రూ, ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీల మ‌ధ్య ఇప్పుడు వివాదాల వాతావ‌ర‌ణం నెల‌కొనే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. తాజా ప‌రిణామాలు వీరి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావిచ్చేలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.  విజ‌య‌వాడ సెంట్ర‌ల్ కి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, కాంగ్రెస్ మాజీ నేత‌, దేవినేని రాజ‌శేఖ‌ర్‌(నెహ్రూ) ఇటీవ‌ల తిరిగి టీడీపీ సైకిల్ ఎక్కారు. నిజానికి ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం టీడీపీతోనే ప్రారంభ‌మైంది. అయితే, ఆ త‌ర్వాత జ‌రిగిన పొలిటిక‌ల్ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డం.. ఇప్పుడు తిరిగి టీడీపీలోకి రావ‌డం జ‌రిగాయి.

కానీ, టీడీపీలోనే పుట్టి.. టీడీపీలోనే కొన‌సాగుతున్న గ‌న్న‌వ‌రానికి చెందిన వ‌ల్ల‌భ‌నేని వంశీకి నెహ్రూకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే పొలిటిక‌ల్ ఘ‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో టీడీపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడిగా వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్న స‌మయంలో దేవినేని కాంగ్రెస్‌లో కీల‌కంగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించుకున్నారు. నువ్వు, నువ్వు అంటూ ఏక వ‌చ‌నంతో కూడా సంబోధించుకున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద ఎత్తున విభేదాలు పొడ‌చూపాయి. వ‌ల్ల‌భ‌నేనికి మ‌ద్ద‌తిచ్చే మ‌రో ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ కూడా దేవినేనితో విభేదించారు. ఇక‌, ఇటీవ‌ల మారిన పొలిటిక‌ల్ ప‌రిణామాల‌తో దేవినేని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 అయితే, అప్ప‌ట్లోనే వ‌ల్ల‌భ‌నేని, బోడేలు ఇద్ద‌రూ నెహ్రూ రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే, రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో వారిని చంద్ర‌బాబు కూల్ చేశారు. అయితే, ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ దేవినేని, వ‌ల్ల‌భ‌నేని మ‌ధ్య వివాదం మొద‌లైంది. వ‌ల్ల‌భ‌నేని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎనికేపాడు బీవీ రావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు కాలువ మీదుగా రాక పోకలు సాగించడానికి ఏర్పాటు చేసిన కల్వర్టుకు రెండువైపులా ఉన్న గోడలను నెహ్రూ అనుచరులు శుక్రవారం రాత్రి పొక్లెయిన్‌తో కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని వ‌ర్గీయులు వేలు పెట్ట‌డంపై ఫైరైపోయారు.

త‌న‌పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాల‌ని నెహ్రూ భావిస్తున్నార‌ని పేర్కొంటూ టీడీపీ అధిష్టానం స‌హా స్టేల్ ప్రెసిడెంట్ క‌ళా వెంక‌ట్రావ్‌కి కూడా ఫిర్యాదు చేశార‌ట‌. అంతేకాదు,  తన నియోజకవర్గంలో నెహ్రూ ఆధిపత్యాన్ని సహించనని తేల్చిచెప్పినట్లు సమాచారం. నెహ్రూ పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలకు అనుగుణంగా తమకు పూర్తి న్యాయం చేయాలని వంశీ డిమాండ్‌చేశారని తెల‌సింది. దీంతో ఈ ప‌రిణామాలు రానున్న రోజుల్లో మ‌రింత‌గా ముదిరే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నెహ్రూ, వంశీల మ‌ధ్య పొలిటిక‌ల్ ఫైటింగ్ మొద‌లైంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. దీనిని సీఎం చంద్ర‌బాబు ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.