దేశంలోకి బ్రాహ్మ‌ణి ఎంట్రీ త‌ప్ప‌దా?!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో యాక్టివ్‌గా ప‌నిచేసే నేత ఒక్క‌రే క‌నిపిస్తున్నారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు సీఎం చంద్ర‌బాబే!! ఈ విష‌యంలో అనుమానించాల్సిన ప‌నేలేదు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఎంతో యాక్టివ్‌గా న‌డిపించాల్సిన ఈ స‌మ‌యంలో దాదాపు అంద‌రూ ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీగా ఉండ‌గా, ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌ర్వేల ఫ‌లితాల‌తో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు డీలా ప‌డిపోయారు! ఏం చేస్తే ఏం కొంప మునుగుతుందో అన్న‌టైపులో వారు అంటీ ముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. దీంతో చంద్ర‌బాబు మాత్ర‌మే యాక్టివ్‌గా అన్ని ప‌నుల్లోనూ దూసుకుపోతున్నారు.

ఇటీవ‌ల ఇదే విష‌యాన్ని ఆయ‌న మంత్రుల వ‌ద్ద ప్ర‌స్థావించారు కూడా. అన్నింటినీ నేనే చూసుకోవాలా?  మీకు బాధ్య‌త‌లేదా? అని ఒకింత క‌టువుగానే క‌డిగి పారేశారు. మ‌రోప‌క్క పార్టీ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో సీఎం త‌న‌యుడు లోకేష్ ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆరోగ్య రీత్యా యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నాడు. స్పాండిలైటిస్‌తో నేను బాధ‌ప‌డుతున్నాను అని ఓపెన్ అయిపోయారు కూడా. సో.. ఇప్పుడు అటు పార్టీ ప‌రంగాను, ఇటు ప్ర‌భుత్వ ప‌రంగానూ చంద్ర‌బాబే యాక్టివ్‌గా ఉండాల్సి వ‌స్తోంది. కానీ, ఎన్న‌ని ఆయ‌న మాత్రం చూడ‌గ‌ల‌రు. నిజానికి ఇప్ప‌టికే రోజుకు 18 నుంచి 20 గంట‌లు ఆయ‌న ప‌నిచేస్తున్నార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

మ‌రో రెండేళ్ల‌లో రాష్ట్రంలో ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. మ‌రోసారి అధికారంలోకి రావాలంటే ఖ‌చ్చితంగా ఇప్పుడున్న వేగం ఎంత‌మాత్ర‌మూ స‌రిపోద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అంటే మ‌రింత వేగంతో దూసుకుపోక‌త‌ప్ప‌దు. మ‌రి అలా దూసుకుపోగ‌ల నేత ఎవ‌రున్నారు? చ‌ంద్ర‌బాబు ఇప్పుడు దీనిపైనే దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు త‌న కోడ‌లు, లోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి క‌నిపించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. బ్రాహ్మ‌ణిని ఇప్ప‌టికే బిజెనెస్‌లోకి ఎంట‌ర్ చేశారు చంద్ర‌బాబు. హెరిటేజ్ అంతా బ్రాహ్మ‌ణి చేతులు, చేత‌ల మీద‌గానే న‌డుస్తోంది.

దీంతో ఏడాది కూడా తిర‌గ‌కుండానే ఈ సంస్థ‌కి షేర్ మార్కెట్‌లో లాభాల పంట పండుతోంద‌ట‌. అలాగే హెరిటేజ్ షేర్ వాల్యూ కూడా భారీగా పెరిగింద‌ట‌. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. చిన్న వ్యాపారం అప్ప‌జెబితేనే.. ఇంత‌లా దూసుకుపోతున్న బ్రాహ్మ‌ణిని.. టీడీపీలో కి తీసుకువ‌స్తే.. మ‌రింత‌గా రిజ‌ల్ట్ ఉంటుంద‌ని, త‌న‌పై భారం కూడా త‌గ్గుతుంద‌ని అనుకుంటున్నార‌ట‌. అదేస‌మ‌యంలో జ‌నాల్లో ఉన్న ఎన్‌టీఆర్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా మ‌రింతగా పెరుగుతుంద‌ని బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఉన్న‌త విద్యావంతురాలైన బ్రాహ్మ‌ణి.. అటు అధికారుల‌తోనూ ప‌నులు చేయించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ట‌. దీంతో త్వ‌ర‌లోనే బ్రాహ్మ‌ణిని టీడీపీ ఎంట్రీ చేయిస్తే.. 2019లో గెలుపు త‌థ్యం అని బాబు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ఇదే క‌నుక ఆచ‌ర‌ణ‌లో పెడితే.. త్వ‌ర‌లోనే నంద‌మూరి వంశానికి చెందిన బ్రాహ్మ‌ణి.. టీడీపీ ఎంట్రీ ఖాయ‌మ‌ని స‌మాచారం. ఇక‌, ఈ ప‌రిణామం అన్ని విధాలా చంద్ర‌బాబుకు కూడా క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి గుర్రం ఎగురుతుందో లేదో చూడాలి!