త‌న‌కు తానే బుక్ అయిన చంద్ర‌బాబు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని న‌మ్ముకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిపై అటు విప‌క్షాలు, ఇటు అధికారుల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న మంత్రి వ‌ర్గం మీడియా స‌హా ప్ర‌తి ఒక్క‌రిపైనా ఎద‌రు దాడినే కొన‌సాగించారు. స్విస్ ఛాలెంజ్ ప్ర‌క్రియ‌ను అద్భుతంగా కొనియాడారు. మ‌న‌దేశంలో ఇంతటి సామ‌ర్ధ్యం, నైపుణ్యం ఉన్న సంస్థ‌లు, వ్య‌క్తులు లేవ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఎట్టిప‌రిస్థితిలోనూ స్విస్ ఛాలెంజ్‌లోనే రాజ‌ధాని ప‌నులు జ‌రిగి తీర‌తాయ‌న్నారు. అయితే, కొన్ని కాంట్రాక్టు సంస్థ‌లు దీనిపై హైకోర్టును ఆశ్ర‌యించాయి.

స్విస్ విధానంలో ఉన్న మ‌త‌ల‌బు ఏమిటో అర్ధంకావ‌డం లేద‌ని, త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని వాదించాయి. దీనిపై లోతైన విచార‌ణ చేసిన హైకోర్టు.. ఇటు ప్ర‌భుత్వ వాటా, ఇటు సింగ‌పూర్ కంపెనీల వాటా? ఎంతో చెప్ప‌డంపై దాప‌రికం ఎందుక‌ని ప్ర‌శ్నించింది. అంతేకాకుండా దాదాపు స్విస్ ఛాలెంజ్ విష‌యంలో ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టింది. అయితే, ఇంత‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంపై వెన‌క్కి త‌గ్గ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఆది నుంచి స్విస్‌ను నెత్తికి ఎత్తుకున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు ఉన్న‌ప‌ళాన దీనిని ప‌క్క‌న పెట్టేందుకు సిద్ధ‌మ‌వ‌డంపై ఏదో ఉంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఓ వైపు హైకోర్టులో కేసు నడుస్తుండగా…ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాల అభివృద్ధి కల్పనా చట్టానికి సవరణలు చేసి…అధికారుల అధికారానికి కత్తెర వేసి ప్రభుత్వం అన్నీ తన చేతుల్లో పెట్టుకుంది. అలాగే, హైకోర్టులో దాఖ‌లు చేసిన ప్ర‌భుత్వ వాద‌న‌ల ప‌త్రాల‌ను కూడా వెన‌క్కి తీసుకున్నారు. దీంతో స్విస్ పై ప్ర‌భుత్వం పూర్తిగా వెన‌క్కి త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంది. వాస్త‌వానికి  సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో ఫోన్ లో సంప్రదింపులు జరిపి ‘డీల్’ ఖరారు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని హైపవర్ కమిటీ మినిట్స్ సాక్షిగా బహిర్గతం చేసింది. మ‌రి అలాంటి డీల్‌ని ఇప్పుడు ర‌ద్దు చేసుకునేందుకు బాబు రెడీ అయిన‌ట్టు స‌మాచారం.

దీని వెనుక ఎలాంటి మ‌త‌ల‌బు లేకుంటే ఎందుకు ర‌ద్దు చేసుకుంటున్నార‌నేది ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో హైకోర్టులో ప్ర‌భుత్వం ఎందుకు వాద‌న‌లు వినిపించ‌డంలేద‌ని కూడా ప్ర‌ధానంగా మారింది. దీంతో స్విస్ విష‌యంలో ప్ర‌భుత్వ‌మే త‌ప్పు చేసింద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది. సీఎం చెబుతున్న‌ట్టు సర్కారు తప్పేమీ లేకపోతే హైకోర్టు తీర్పు వెలువడే వరకూ వేచిచూడాల్సింది. అలాకాకుండా ప్రభుత్వమే తనంత తానుగా నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంటామని ప్రకటించటంతో తప్పు ఎవరు చేసింది తెలిసిపోయింది. సో.. ఈ వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబు త‌నంత‌ట తానుగా స్విస్ ఛాలెంజ్‌లో బుక్ అయ్యార‌నే వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది.