టీఆర్ఎస్‌లో రేగుతున్న అసంతృప్తి జ్వాల‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు రాజ‌కీయ, పాల‌నాప‌ర‌మైన వ్యూహాలేమిటో విప‌క్షాల‌కు మాత్ర‌మే కాదు… ఒక్కోసారి సొంత పార్టీ నేత‌ల‌కు కూడా అర్థంకావు.  అవును మ‌రి… నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో కేసీఆర్ వైఖ‌రి చూస్తే ఎవ‌రికైనా అలాగే అనిపిస్తుంది.  పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపేందుకు  వివిధ కార్పొరేషన్లు, మార్కెట్, దేవాదాయ, గ్రంథాలయ సంస్థల వంటి పదవులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కలిపి సుమారు 4 వేలకు పైగానే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలోనే ప్ర‌క‌టించారు. రోజుల గ‌డుస్తున్నా ఈ హామీ ఇంకా ఆచరణ రూపం దాల్చలేదు.  నామినేటెడ్ పదవుల కోసం ఎన్నోఆశ‌ల‌తో చ‌కోర ప‌క్షుల్లా ఎదురు చూస్తున్న పార్టీ సీనియర్లకు కూడా చివరకు ఎదురుచూపులే మిగులుతున్నాయి.

టీఆర్‌ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా భర్తీ చేసిన రాష్ట్రస్థాయి పదవులు  రెండు ప‌దుల సంఖ్య‌ను కూడా ఇంకా చేరుకోలేదు. ఇదిలా ఉండ‌గా భర్తీ అయిన పదవుల్లో కూడా ఒక్క  మహిళ కూడా లేక‌పోవ‌డం చూస్తే… రాష్ట్ర క్యాబినెట్లో మ‌హిళ‌ల‌కు కొంచెం కూడా ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను  కేసీఆర్  ఏమాత్రం ఖాత‌రు చేయ‌డంలేద‌ని అర్థ‌మవుతోంది.

ఇటీవ‌లే  దసరా సందర్భంగా ఒకేసారి 9 కార్పొరేషన్లను భర్తీ చేసిన సీఎం కేసీఆర్ మరికొన్ని సంస్థల గురించి ఇంకా దృష్టి సారించ‌లేద‌ని  ఆ పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి పాలక మండళ్ల భర్తీ ప్రక్రియ మొదలైంది కాని… ఇంకా చాలా చోట్ల ఎంపికలే జరగలేదు.  ఇక జిల్లా స్థాయిలో దేవాదాయ కమిటీలకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు కానీ భర్తీ ప్రకియను ప్రారంంభించలేదు.

తెలంగాణ‌లో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలుగా ఉన్న వేములవాడ, యాదాద్రి వంటి ఆలయాల పాలక మండళ్లకు సైతం ఇప్ప‌టిదాకా  అతీగతీలేదంటే కేసీఆర్ అనుస‌రిస్తున్న వైఖ‌రి ఏమిటో పార్టీ సీనియ‌ర్ల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. దీంతో పదవుల కోసం దీర్ఘ‌కాలంగా ఆశ‌లు పెంచుకున్న పార్టీ సీనియర్లు, ఇతర ఆశావహుల్లో ఒక‌వైపు ఉత్కంఠ… మ‌రోవైపు అస‌హ‌నం అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.  పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నాత‌మ త‌ల‌రాత ఏమాత్రం మార‌లేద‌ని, త‌మ‌ను పార్టీ అధినేత క‌రుణించ‌డం లేదేమిటాఅని వీరు దిగాలుప‌డుతున్నారు.

అయితే పార్టీ అంత‌ర్గ‌త విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం మేరకు దీపావళికల్లా మరికొన్ని కార్పొరేషన్ల పదవులను భర్తీ చేసే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఈ ద‌ఫా ప‌ద‌వుల పంవ‌కంలో మ‌హిళ‌లు, మైనారిటీలు, యువతకు కేసీఆర్  అవకాశం ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. . రాష్ట్ర మహిళా కమిషన్, స్త్రీ, శిశు సంక్షేమ రీజనల్ కమిటీలు, వక్ఫ్ బోర్డు, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ, వికలాంగ కార్పొరేషన్లు, హార్టీకల్చర్ కార్పొరేషన్, హుడా, హౌసింగ్ కార్పొరేషన్ వంటి సంస్థల నామినేటెడ్ పోస్టులను ఈ విడ‌త‌లో భ‌ర్తీ చేసి పార్టీలోని అన్ని వ‌ర్గాల‌ను సాధ్య‌మైనంత‌వ‌ర‌కు సంతృప్తి ప‌ర‌చేందుకు కేసీఆర్ గ‌ట్టి క‌స‌ర‌త్తునే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంటే కేసీఆర్ కరుణాక‌టాక్ష వీక్ష‌ణాలు ఎవ‌రిమీద ప్ర‌స‌రించ‌నున్నాయో కొన్నిరోజుల్లోనే తేలిపోనుంద‌న్న‌మాట‌.