చంద్ర‌బాబు వ్యూహాల్లో ప‌దును త‌గ్గిందా…?

ఓ చేత్తో పాల‌నా ప‌గ్గాల‌ను, మ‌రో చేత్తో పార్టీ వ్య‌వ‌హారాల‌ను స‌మ‌ర్థంగా సమ‌న్వ‌యం చేసుకురావ‌డం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కొత్తేమీ కాదు. ఉమ్మ‌డి ఏపీకి అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన రికార్డును త‌న‌పేరిట శాశ్వ‌తంగా లిఖించుకున్న‌ టీడీపీ అధినేత మంచి పాల‌నాద‌క్షుడిగా దేశ‌వ్యాప్తంగా పేరు, ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్నారు. ఆయ‌న తిరుగులేని రాజ‌కీయ వ్యూహాలు, సామ‌ర్థ్యం కార‌ణంగానే పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, తెలుగువారి  ఆరాధ్య న‌టుడు, సంచ‌ల‌న రాజ‌కీయ విజ‌యాల సార‌థుడు, సాధ‌కుడు అయిన‌ ఎన్టీఆర్ చేతుల్లోంచి సైతం … పార్టీని త‌న అదుపాజ్ఞ‌ల్లోకి తెచ్చుకోగ‌లిగారు.

అయితే ప్ర‌స్తుతం.. ఆరున్న‌ర ప‌దుల వ‌య‌సుకు చేరిన‌  ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబులో మునుప‌టి సామ‌ర్థ్యం త‌గ్గిందా…  ఆయ‌న వ్యూహాల్లో వెనుక‌టి ప‌దును క‌నిపించ‌డంలేదా…?   ఆయ‌న స‌హ‌జ ల‌క్ష‌ణాలుగా చెప్ప‌ద‌గ్గ‌.. ఓర్పు, నేర్పు ఇప్పుడు ఆయ‌న‌లో అరుదుగా మాత్ర‌మే చూడ‌గ‌లుగుతున్నా మా…?   ఈ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న‌ది ఎవ‌రో రాజ‌కీయ విశ్లేష‌కులో, బ‌య‌టి వ్య‌క్తుల్లో కాదు.. టీడీపీలోనే  అంత‌ర్గ‌తంగా నాయ‌కుల‌నుంచి వినిపిస్తున్న వ్యాఖ్య‌లివి.    తెలుగుదేశం అధ్య‌క్షుడు, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో వచ్చిన అనూహ్యమైన మార్పులకు కారణమేమిటని పాత తరం నేతలు ప్రశ్నవేస్తున్నారు.

ప్రస్తుతం ఏవో మంచి పదవుల్లోనే ఉంటూ పాల‌న‌లోను, పార్టీలోను కాస్త  పట్టు చూపించగల నాయకులు సైతం అధినేత అనవసరమైన వ్యవహారాలతో ఎందుకు హైరాన పడుతున్నారని ఆశ్చర్యపోతున్నారు. విప‌క్ష‌ వైసీపీ నాయకులు చేసేవి రాజ‌కీయ విమ‌ర్శ‌లుగా కొట్టి పారేయ‌వ‌చ్చుకాని, సొంత పార్టీలోనే త‌న వ్య‌వ‌హార  శైలిపై వస్తున్న కామెంట్ల‌పై చంద్ర‌బాబు ఖఛ్చితంగా ఆలోచించాల్సిన అవ‌స‌ర‌ముంది. . వయసును సైతం లెక్క చేయ‌కుండా…  పాల‌న‌, పార్టీకి సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై నిరంత‌రం.. పరుగులు తీయడం వల్ల చంద్ర‌బాబు మానసికంగా శారీరకంగా అలసి పోవడంతో ప్ర‌స్తుతం ఆయ‌న నేల విడిచి సాము చేస్తూ అతిశ‌యోక్తుల‌తో కాలం గడుపుతున్నార‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు.

గతంలో పార్టీ నేతలు, క్షేత్ర స్థాయిలో కార్య‌కర్త‌లు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవ‌డంతో పాటు అనుభ‌వ‌జ్ఞులైన నాయ‌కులు ఏదైనా చెబితే  ఆయ‌న వినేవ‌రాని, విమర్శలకు ఎక్కువ విలువ నిచ్చేవార‌ని, అయితే ఇప్పుడు ఎవ‌రికీ మాట్లాడే సమయమే ఇవ్వడం లేద‌ని కొంద‌రు టీడీపీ  సీనియ‌ర్ నాయ‌కులే స్వ‌యంగా చెపుతున్నారు.  మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపి సీఎంరమేష్‌లు మరోవైపు బిజెపి సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు మాటలు తప్ప చంద్ర‌బాబు మరెవరి స‌ల‌హాలు  వినే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ నేత‌లు వాపోతున్నారు.

ఇక మునుప‌టిలా ఢిల్లీలోనూ ఆయ‌న మాట అంత‌గా చెల్లుబాటు కావ‌డం లేద‌ని, గతంలో వామపక్షాల మద్దతు, యునైటెడ్‌ ఫ్రంట్‌ పాలన ఉన్నప్పుడు చంద్రబాబుకు ఉన్న గౌరవం, ఇక‌ మొదటి ఎన్‌డీఏ హ‌యాంలో ఉన్న‌పట్టు ఇప్పుడు ఏమాత్రం క‌నిపించ‌డం లేద‌ని కూడా వారు తేల్చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్ర‌బాబులో నాయ‌క‌త్వం ల‌క్ష‌ణాలు త‌గ్గి, అభ‌ద్ర‌త భావం పెరుగుతోందా..? అన్న అనుమానాలు సైతం వారు వ్య‌క్తం చేస్తున్నారు.