చంద్ర‌బాబుకు మావోల లేఖ‌లో సందేహాలెన్నో..!

ఆంధ్రా, ఒడిసా స‌రిహ‌ద్దు ఏవోబీలో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్ మావోయిస్టు ఉద్య‌మంపై పెద్ద దెబ్బే వేసింది. దాదాపు ఏక‌ప‌క్షంగా సాగిన కాల్పుల్లో ఆ రోజు 28 మంది తాజా లెక్క‌ల ప్ర‌కారం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఏపీ స‌హా దేశ వ్యాప్తంగా అంద‌రూ దృష్టి సారించారు. ఏపీ పోలీసుల ప్ర‌తిభ గొప్ప‌ద‌ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు కూడా. అయితే, ఇప్పుడు మాత్రం పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే, ఘ‌ట‌న జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత మావోయిస్టుల నుంచి ఓ లేఖ వ‌చ్చింది. తొలుత ఇది సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిచ్చినా.. త‌ర్వాత మీడియా కార్యాల‌యాల‌కు చేరింది.

ఈ లేఖ‌లో సారాంశం ఏంటంటే.. త‌మపై దొంగ దెబ్బ వేసిన సీఎం చంద్ర‌బాబుకు త‌గిన బుద్ధి చెబుతామ‌ని, ఆయ‌న కుటుంబాన్ని మొత్తాన్ని అంతం చేస్తామ‌ని! అంతేకాదు, ఈ సారి మావోయిస్టులు ఆ లేఖ‌లో బాబు కుమారుడు లోకేష్ పేరును ప్ర‌త్యేకంగా కూడా పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ఆత్మాహుతి దాడులకు కూడా తెగ‌బ‌డ‌తాం అని వారు హెచ్చ‌రించారు. త‌మ నుంచి చంద్ర‌బాబు త‌ప్పించుకోలేర‌ని, ఖ‌చ్చితంగా చంపి తీరతామ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఏపీ త‌ర‌ఫున‌ మావోయిస్టు అధికా ర ప్ర‌తినిధి  శ్యామ్ పేరిట లేఖ అందింది. సాధార‌ణంగా మావోయిస్టులు లేఖ‌లు రాయ‌డం గతంలోనూ అనేక మార్లు జ‌రిగింది.

అయితే, ఇప్పుడు కూడా అదే క్ర‌మంలో వారు రాసి ఉంటార‌ని అంద‌రూ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ లేఖే సెంట‌ర్ ఆఫ్‌ది న్యూస్‌గా మారింది. యాక్చువ‌ల్‌గా మావోయిస్టుల ప‌ద‌జాలం, వారి సిద్ధాంతాలు టోట‌ల్ డిఫ‌రెంట్‌! వాస్త‌వానికి లేఖ రాసేందుకు వాడిన లెట‌ర్ హెడ్ నుంచి అందులో వాడిన భాష వ‌ర‌కు మొత్తం డిఫ‌రెంట్ గా ఉంది. అంతేకాకుండా మావోయిస్టుల శైలికి భిన్నంగా ఉంది. లెట‌ర్ హెడ్‌పై భార‌త క‌మ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్టు) అని ఉండాలి. అదేవిధంగా ఎడ‌మ వైపున ఎర్ర‌జెండా పై సుత్తి కొడ‌వ‌లి ఉంటుంది. అయితే, తాజా లెట‌ర్‌హెడ్‌పై ఎర్ర‌జెండా లేదు. సుత్తి కొడ‌వ‌లి ఉంది.

మ‌రోవైపు భార‌త మావోయిస్టు పార్టీ అని రాయాల్సిన చోట‌.. క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా రాశారు. ఇక‌, లేఖ‌లో త‌మ శైలికి భిన్నంగా చ‌నిపోయిన వాళ్ల‌ను న‌క్స‌ల్స్ అని సంబోధించారు. వాస్త‌వానికి ఎన్‌కౌంట‌ర్ మృతుల‌ను యుద్ధ‌వీరులుగా పేర్కొంటారు మావోయిస్టులు. అదేవిధంగా ఇప్పుడు విడుద‌ల చేసిన లెట‌ర్‌లో ఆత్మాహుతి దాడులు అని రాశారు. ఇది అస‌లు మావోయిస్టుల డిక్ష‌న‌రీలోనే లేదు. సో.. ఇలా అన్ని కోణాల్లోనూతాజా లేఖ అనేక అనుమానాల‌కు, కొత్త కోణాల‌కు తావిస్తోంది. మ‌రి దీనిని మావోయిస్టులే రాశారా?  లేక వారి సానుభూతి ప‌రులు రాశారా?  తెలియాల్సి ఉంది. ఇవ‌న్నీ కొత్త ప్ర‌శ్న‌లుగానే మిగులుతున్నాయి.