ల‌గ‌డ‌పాటి టీడీపీ ఎంట్రీ..!

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ … ఉమ్మ‌డి  తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో రెండు మూడేళ్ల క్రితం దాకా ఆ పేరే ఓ సంచ‌ల‌నం. త‌న చొర‌వ‌, దూకుడు క‌ల‌గ‌లిసిన  స్వ‌భావంతో ఆయ‌న పారిశ్రామికంగా అతి త‌క్కువ కాలంలోనే అగ్ర‌శ్రేణి పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగిన వ్య‌క్తి. ఇక  రాజ‌కీయరంగంలోనూ ఆయ‌న ప‌దేళ్ల ప్ర‌స్థానం అడుగ‌డుగునా సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌నను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ఓ ర‌కంగా రాజ‌గోపాల్‌ ఒంట‌రి పోరాట‌మే కొన‌సాగించారు.

ఓ ప‌క్క విభ‌జ‌న వాదుల‌తోను, మ‌రో ప‌క్క తన సొంత పార్టీ ఐన కాంగ్రెస్ అధిష్ఠానంతోను ఆయ‌న అలుపెరుగ‌ని పోరు స‌లిపార‌నే విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు లోక్‌స‌భ‌లో దౌర్జ‌న్యంగా బిల్లును నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అడ్డుకునేందుకు రాజ‌గోపాల్ పెప్ప‌ర్ స్ప్రేను వినియోగించి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల‌కెక్కారు.  అయితే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిపోవ‌డంతో రాజ‌కీయ స‌న్యాసం చేసిన నేత ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌.  ఆ త‌ర్వాత ఎక్క‌డా రాజ‌కీయతెర‌పై క‌నిపించ‌లేదు. రాజ‌కీయ నేత‌ల ఇళ్ల‌లో జ‌రిగే వేడుక‌ల‌లో మాత్రం ల‌గ‌డ‌పాటి అడ‌పా ద‌డ‌పా ఆయ‌న త‌ళుక్కుమంటున్నారు. అంత‌కుమించి ఏ రాజ‌కీయ కార్య‌క్మంలో కానీ, రాజ‌కీయ సంబంధ విష‌యాల‌పై కానీ ఆయ‌న క‌నిపించ‌డం లేదు. స్పందించ‌డం లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం..  ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

గ‌తంలో ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌చ్చినా అది నిజం కాద‌ని తేలిపోయింది.  ఇప్పుడు  టీడీపీలో చేరే విష‌యం పైనా రాజ‌గోపాల్ కానీ, ఆయ‌న ప్ర‌తినిధులు కానీ ఇప్ప‌టిదాకా స్పందించ‌లేదు.  కానీ ప్ర‌స్తుతం ఇది విజ‌య‌వాడ‌ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కు చెందిన‌ అతి పెద్ద పారిశ్రామిక గ్రూపు ల్యాంకో . గ‌తంలో ఓ వెలుగు వెలిగిన ఈ సంస్థ‌ ప్ర‌స్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. సంస్థను  ఇబ్బందుల‌నుంచి త్వ‌ర‌గా ఒడ్డెక్కించే ప‌నుల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న రాజ‌గోపాల్ ఇప్పుడు రాజ‌కీయాల‌పై దృష్టి సారించే అవ‌కాశ‌ముందా.. ? అంటే పూర్తిగా కొట్టిపారేయ‌లేమంటున్నారు  రాజ‌కీయ వ‌ర్గాలు. ఓ ర‌కంగా రాజ‌గోపాల్‌కు రాజ‌కీయ అండ‌దండలు కూడా ఇప్పుడు అవ‌స‌ర‌మే గ‌నుకు ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధ‌మ‌వుతుండొచ్చ‌ని ఆ వ‌ర్గాలు అంటున్నాయి.

అలాగే.. పార్టీల ప్ర‌భావం జ‌నంలో ఎలా ఉంది, వారి తీర్పు ఎలా ఉండ‌బోతుంది..? అన్న అంశాల్లో రాజ‌గోపాల్ త‌న ప్రైవేటు స‌ర్వేల ద్వారా సేక‌రించే స‌మాచారం నూటికి నూరు పాళ్లు య‌థాత‌థంగా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ప్ర‌తిఫ‌లించ‌డం గ‌తంలో మెజారిటీ సంద‌ర్భాల్లో అంద‌రికీ తెలిసిందే. అలాగే ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌గా దేశ దేశాల్లోని ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ల‌తో ఆయ‌న‌కు ఉన్న వ్యాపార సంబంధాలు, ప‌రిచ‌యాలు కూడా రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో రాజ‌గోపాల్ త‌న శిబిరంలో ఉంటే త‌మ పార్టీకి ప్ర‌యోజ‌న‌మేన‌ని చంద్ర‌బాబు కూడా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. రాజ‌గోపాల్ పసుపు కండువా క‌ప్పుకోవ‌డం మ‌నం త్వ‌ర‌లోనే చూడవ‌చ్చ‌న్న‌మాట‌.