ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ వెన్నులో వణుకు తప్పదు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను జంప్‌ జిలానీలుగా వ్యవహరిస్తున్నాం. వాళ్ళందరికీ ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో వెన్నులో వణుకు మొదలైంది. తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు స్పందించిన న్యాయస్థానం, తెలంగాణ స్పీకర్‌కి స్పష్టమైన సూచనలు చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని. హైకోర్టు తీర్పుపై స్పీకర్‌ స్పందించి, తమపై అనర్హత వేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోననే బెంగతో తల్లడిల్లుతున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. వీరిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వం ముందు అనేక ఆప్షన్స్‌ ఉంటాయి ఇలాంటి విషయాల్లో.

 90 రోజుల సమయం ఇచ్చింది గనుక, ఈలోగా ఆలోచించుకుని, అధికార పక్షం ఏదో ఒక రకంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేయవచ్చు. టిడిపికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలే కాకుండా కాంగ్రెస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించినోళ్ళే. తెలంగాణకే న్యాయస్థానం తీర్పు వర్తించనుంది ఇప్పటికి. ఈ విజయంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కూడా న్యాయపోరాటం చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ తీపి కబురు అందుకోవచ్చు. అప్పుడు అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ వెన్నులో వణుకు తప్పదు.