పవన్ చేతిలో మూడు స్టోరీలు

రాజకీయ బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ తన అభిమానుల్ని ఉద్దేశించి సినిమాల్ని వదిలెయ్యమంటారా? అని అడిగారు. ముక్తకంఠంతో వద్దు వద్దు అంటూ చేతులూపారు అభిమానులు. అంటే పవన్‌ని తెరపై చూడటం వాళ్లకి ఎంత ఇష్టమో ఆ సన్నివేశమే చెప్పింది. నిజానికి సినిమాల్ని వదిలిపెట్టాలని పవన్‌కల్యాణ్ ఎప్పుడో అనుకొన్నారు. కానీ అభిమానుల అభిప్రాయానికి విలువనిస్తూ ఒకపక్క రాజకీయంలో కొనసాగుతూనే మరోపక్క సినిమాలూ చేస్తున్నారు.

ఇక పవన్ సినీ ప్రయాణం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలు బలంగా రావడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకొన్న దర్శకులంతా మరింత ఉత్సాహంతో తమ కలాలకి పదును పెడుతున్నారు. పవన్‌ని దృష్టిలో ఉంచుకొని విరివిగా కథలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం డాలీ (కిషోర్ పార్థసాని) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడుతో పాటు మరో మూడు చిత్రాలకి పవన్ కల్యాణ్ పచ్చజెండా వూపారు. ఒక చిత్రానికి త్రివిక్రమ్, మరొక చిత్రానికి తమిళ దర్శకుడు టి.ఆర్.నేసన్ తెరకెక్కిస్తారు. మరో చిత్రానికి సంబంధించి తెరపైకొస్తున్న దర్శకుల పేర్లు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

పవన్‌కల్యాణ్ చేస్తున్న సినిమా పూర్తయితే తప్ప, ఆ తర్వాత చేయబోయే సినిమా ఏంటి? ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనే విషయంపై స్పష్టత వచ్చేది కాదు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఆయన చిత్రాలు లైన్లో ఉన్నాయి. దీంతో పవన్ సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పవన్ వేగంగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకొంటున్నారు.