జగన్‌ కంచుకోటలో చంద్రబాబు పాగా !

కడప జిల్లా అంటే వైఎస్‌ జగన్‌ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్‌ జగన్‌కి షాక్‌ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు.

కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ యంత్రాంగం ఎంతో శ్రమించింది. కడప జిల్లా నుంచే కాకుండా, వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలను కడపకు తరలించి, భారీ హంగామా నడుమ మహా సంకల్ప సభను నిర్వహించడం జరిగింది. సభా వేదికపైనుంచి వైఎస్‌ జగన్‌ని టార్గెట్‌గా చేసుకుని టిడిపి నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. కనీ వినీ ఎరుగని రీతిలో పెద్దయెత్తున పోలీసుల్ని జిల్లాలో మోహరించి, ఎలాంటి ఉద్రిక్తతలూ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకు ముందే కడప జిల్లా మీద ఫోకస్‌ పెట్టి, ఈ జిల్లా నుంచి పలువురు నాయకుల్ని టిడిపిలోకి వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆకర్షించిన చంద్రబాబు, సంకల్ప సభతో పట్టు సాధించామనే ధీమా వ్యక్తం చేశారు. ఇది వైఎస్‌ఆర్‌సిపి శిబిరాల్ని ఆందోళనకు గురిచేస్తోంది.