తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయగా… రేవంత్‌ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేశారు. అటు ఈటల రాజేందర్‌ సైతం హుజురాబాద్, గజ్వేల్‌లో నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల ఆఖరు సమయంలో ఆసక్తికరంగా మార్పులు చేర్పులు జరిగాయి. కొన్ని పార్టీలు అభ్యర్థులకు బీఫాం ఇచ్చి తిరిగి తీసుకుని, మరో వ్యక్తికి ఇచ్చి, నామినేషన్లు వేయించాయి. సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఇండిపెండెంట్లు సైతం భారీగా నామినేషన్లు వేశారు. గజ్వేల్‌లో కేసీఆర్ మీద 50 మంది భూ బాధితుల నామినేషన్లు వేశారు.

ఇక నవంబర్‌ 13న నామినేషన్లు పరిశీలించనున్నారు. అలాగే నవంబర్‌ 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముస్తుంది. నవంబర్‌ 30న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరగనుంది. ఇది ఇలా ఉంటే… కాంగ్రెస్ నుంచి ఎంపీలు ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. నల్గొండ, మునుగోడు నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేస్తుండగా… హుజూర్ నగర్, కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ చేయనున్నారు. బీజేపీలో కిషన్ రెడ్డి మినహా ఎంపీ బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, సోయం బాపూరావులు కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు కూడా ప్రచార సభల్లో పాల్గొని బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు.

అటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సైతం ఇప్పటికే కాంగ్రెస్‌ విజయభేరి సభల పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం తెలంగాణలో రెండు సార్లు నిర్వహించిన బస్సు యాత్ర సక్సెస్‌ అయింది. ఇక మరోసారి రాహుల్‌, ప్రియాంక గాంధీ సైతం ఫుల్‌ టైమ్‌ తెలంగాణలోనే ప్రచారం చేయనున్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పేరుతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు కమలం పార్టీ నేతలు. టార్గెట్‌ కేసీఆర్‌ అన్నట్లుగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.