ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు… కారణం…!

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు ఆగడం లేదు…. రోజుకో అక్రమం బహిర్గతమవుతోంది. బ్రతికున్న వారిని మరణించినట్టు చూపించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించకపోవడం… ఇలా ఒకటి కాదు… కావాల్సినన్ని చిత్ర విచిత్రాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంతో పాటు… జీరో డోర్ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా చెట్లకు కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్కింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది.

ఏపీలో విడుదలైన ఓటర్ల జాబితాలో కావాల్సినన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 27న ఓటర్ల జాబితా ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే, నమోదు చేయాలని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. గతంలో ఉన్న జాబితాలో అనేక అక్రమాలను ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వాటిని సరిదిద్దలేదని, జాబితాలో అవకతవకలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల కమీషన్ చీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఉన్న అవకతవకలను ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఓట్లను సెంట్రల్ నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గాలకు బదిలీ చేయడం పై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. జాబితాలో ఒకరి పేరే రెండు పోలింగ్ బూతులలో ఉండటం, ఒకే కుటుంబంలోని సభ్యులను వేర్వేరు పోలింగ్ బూత్‌లకు మార్చడం వంటి అక్రమాల పై కూడా ఫిర్యాదు చేశారు. అనేక ప్రాంతాల్లో బీఎల్‌ఓలు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆరోపించారు. ప్రకాశం జిల్లా పర్చూరు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, విశాఖలోని పలు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గాల్లో అవకతవకల పై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని, ఫామ్‌-7 లు దరఖాస్తు చేయడం, ఆన్‌లైన్ లో పంపిన ఈ దరఖాస్తులు అన్నీ తప్పుడు పత్రాలని తేలాయి. అయితే, దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నియోజకవర్గం ఎలక్ట్రోరల్ అధికారికి ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసిన వ్యక్తి ఆచూకీ దొరకలేదని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు నేటికి కూడా పెద్ద ఎత్తున ఫామ్‌-7 లను అధికార పార్టీ నేతలు ఆన్‌లైన్ లో పంపుతున్నారని, దీనివల్ల ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో పాటు, ఫామ్‌-6, ఫామ్‌-8 లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే వాటిని నెలల తరబడి పరిష్కరించకపోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్ లలోకి మార్చడంతో వారిని ఒకే పోలింగ్ బూత్ లలోకి మార్చేందుకు ఫామ్‌-8 లను దరఖాస్తు చేసినప్పటికీ, నేటివరకూ వాటిని పరిశీలించకపోవడం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ లో చేసిన దరఖాస్తుల పై కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో వాలెంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని, అనేక నియోజకవర్గాల్లో ఓటర్లను కులాలు, పార్టీల వారీగా మ్యాపింగ్ చేస్తూ వాలెంటీర్ల ఫోన్ లలో ఉన్న యాప్ ల ద్వారా ఎమ్మెల్యే కార్యాలయానికి సమాచారాన్ని పంపడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ, తగిన చర్యలు లేకపోవడంతో టీడీపీ సహా ప్రతిపక్షాలు భవిష్యత్‌ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నాయి.

గతంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని బృందం కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో అప్పట్లో కేంద్ర ఎన్నికల కమీషన్ అధికారులను పంపించి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకల పై విచారణ నిర్వహించడమే కాకుండా, కొంతమంది అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉరవకొండ, ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గాల్లో అనేకమందిని సస్పెండ్ చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా, మరోసారి టీడీపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అవకతవకలకు సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదులు చేయాలని డ్రాఫ్ట్ జాబితాకు ముందు తాము అనేక ఫిర్యాదులను ఆధారాలతో సహా చేసినప్పటికీ, వాటి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అవకతవకల పై తెలుగుదేశం క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది.