టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క వెంకటేష్ వారసులు తప్ప చిరంజీవి నుంచి నాగార్జున వరకు అందరి వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చివరికి కమెడియన్ల కుమారులు కూడా మూవీ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే బాలకృష్ణ కుటుంబ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా నందమూరి వారసుడు సినిమా ప్రకటించలేదు. అయితే ఇటీవల అతడు “భగవంత్ కేసరి” సెట్స్‌లో తరచుగా కనబడుతూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.
అతడు సినిమా సెట్స్‌కు వెళ్లడం గురించి రకరకాల పుకార్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్ శ్రీలీలను మోక్షజ్ఞ పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆమెను చూసేందుకే అక్కడికి రోజూ వెళ్తున్నాడని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వీటిలో నిజం లేదని తాజాగా భగవంత్ కేసరి నిర్మాత కుండబద్దలు కొట్టాడు.
భగవంత్ కేసరి అక్టోబర్ 19 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో ప్రొడ్యూసర్ సాహు గారపాటి తీరిక సమయం లేకుండా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ నిర్మాత బాలకృష్ణ పిల్లలైన మోక్షజ్ఞ, తేజస్విని గురించి మాట్లాడాడు. వారు ఈ సినిమా సెట్స్ కి ఎందుకు వస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో అభిమానులకు తెలియడం లేదు అని ప్రశ్నించగా సాహు గారపాటి అన్ని విషయాలు చెప్పేశాడు.
మోక్షజ్ఞ త్వరలోనే మూవీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎంట్రీ ఇచ్చేముందు అసలు షూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భగవంత్ కేసరి సెట్స్ కు మోక్షజ్ఞ తరచుగా వచ్చాడని క్లారిటీ ఇచ్చాడు. బాలకృష్ణ హోస్ట్ గా నడుస్తున్న ఆహా షో నిర్వహణలో తేజస్విని ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కూడా ఇటీవల సెట్స్‌కు వచ్చి చాలా విషయాలు తెలుసుకుందని అతను చెప్పాడు.