వైసీపీకి సూపర్ ఛాన్స్..వదులుకోకూడదు.!

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్ళడం..వైసీపీకి మంచి అవకాశం అవుతుందా? ఈ ఛాన్స్ సరిగా వాడుకోకపోతే వైసీపీకి మైనస్ అవుతుందా? అంటే అవుననే చెప్పాలి. బాబు జైలుకు వెళ్ళడం ద్వారా టి‌డి‌పి శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. క్షేత్ర స్థాయిలో పోరాటపటిమ తగ్గుతుంది. దీని వల్ల ప్రతిరోజూ వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శలు తగ్గుతాయి. తమ్ముళ్ళ ఫోకస్ మొత్తం బాబు జైల్లో ఉన్నారు..బయటకు ఎప్పుడు వస్తారనే దానిపైనే ఉంటుంది.

ఇలాంటి సమయంలో వైసీపీ మరింతగా ప్రజల్లోకి వెళ్ళి వారి మద్ధతు పొందే అవకాశం ఉంది. బాబు స్కామ్ చేయడం వల్లే అరెస్ట్ అయ్యారనే అంశాన్ని హైలైట్ చేయాలి. ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే ఆరోపణలని తిప్పికొట్టాలి. అప్పుడు వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. వాస్తవానికి బాబు బయట ఉన్న సమయంలో ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరగడం, రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. జనం కూడా భారీగానే వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై, నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏదొక అంశంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.

మరోవైపు పార్టీ నేతలకు, శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అటు లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇవన్నీ వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పుడు బాబు జైలుకెళ్లడంతో అవన్నీ బ్రేకులు పడ్డాయి. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ప్రజల్లో ఇంకా ఎక్కువ తిరిగి వారి మద్ధతు పొందాలి.

అలా కాకుండా బాబుని, పవన్‌ని తిడుతూ కూర్చుంటే పావలా ఉపయోగం ఉండదు. దీని వల్ల ఇంకా టి‌డి‌పికి సానుభూతి పెంచినట్లు అవుతుంది. కాబట్టి అది వదిలేసి ప్రజల్లోకి వెళితే వైసీపీకి ఫుల్ అడ్వాంటేజ్. లేదంటే చేతులారా దెబ్బతినడమే.