అధ్యక్షా… ఎక్కడున్నారు మీరు.. ఏమయ్యారు సార్….!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో… ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది అక్రమమని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు టీడీపీ నేతలు. అయితే ఇదంతా పది రోజుల క్రితం మాట. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. చంద్రబాబు జైలులో ఉన్నారనే విషయం కూడా ప్రస్తుతం పార్టీ ముఖ్య నేతలు మరిచిపోయినట్లున్నారు. పరిస్థితి చూస్తే అలాగే ఉంది. చివరికి పార్టీ రాష్ట్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారం కూడా ఇలాగే కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు జరిగిన రోజున టెక్కలిలో ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు ఆఘమేఘాల మీద విజయవాడ వచ్చారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక అంతే… ఆ తర్వాత నుంచి అచ్చెన్న ఏమయ్యారో ఎవరికీ తెలియటం లేదు.

ఓ వైపు అధినేత అరెస్ట్, మరోవైపు యువ నేత అరెస్టుకు రంగం సిద్ధమనే పుకార్లు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి… అసెంబ్లీ సమావేశాలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది…. అధినేతకు బెయిల్ వస్తుందా రాదా అని కిందిస్థాయి కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. అయినా… సరే… అచ్చెన్న నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కూడా రాలేదు. పైగా అధినేత జైలులో ఉన్నారు… ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలంటూ ఓ మాట అనేసి పోతున్నారు. అంతే తప్ప… రాష్ట్రస్థాయిలో అధినేత విడుదల కోసం ఏం చేయాలనే విషయంపై కనీసం ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు.

అచ్చెన్న వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. అసలు ఏపీ టీడీపీకి అధ్యక్షుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేత అరెస్ట్ అయితే… మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుల వారు ఏమయ్యారు అని నిలదీస్తున్నారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే… ఈఎస్ఐ స్కామ్‌లో మళ్లీ జైలుకు వెళ్తారని భయపడుతున్నారేమో అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారని అడుగుతున్నారు తప్ప… రాష్ట్రస్థాయి నేతల్లో మాత్రం ఆ స్థాయి ఆతృత ఏ మాత్రం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీలో కొందరు నేతలు సైతం… అధ్యక్షా… ఎక్కడున్నారు మీరు.. ఏమయ్యారు సార్…. అని సెటైర్లు వేస్తున్నారు.