అసెంబ్లీ సమావేశాలు… టీడీపీ వ్యూహం ఏమిటో…?

ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలుంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకువస్తున్న నేపథ్యంలో… దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని ఒక వైపు అంటుంటే…. అంతకంటే ముఖ్యమైన విషయం ఉందనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. అయితే అజెండా విషయం ఇప్పటి వరకు రహస్యంగా ఉండటంపై అటు అధికార పార్టీలో, ఇటు ప్రతిపక్షాల్లో కూడా జోలుగా చర్చ నడుస్తోంది.

అయితే ఓ వైపు అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు కావడంతో… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీరుపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఓ వైపు అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆగిపోయింది. అదే సమయంలో లోకేశ్ కూడా అరెస్టు అవుతారంటూ అధికార పార్టీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. అందుకే ఆయన ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో టీడీపీ వ్యవహారం ఎలా ఉంటుందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌‍లో వినిపిస్తున్న మాట.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈ సమావేశాలను టీడీపీ బాయికాట్ చేస్తుందని కొందరంటున్నారు. అదే సమయంలో అసెంబ్లీ వేదికగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఎలాంటి స్కామ్ జరగలేదని… చంద్రబాబు అరెస్ట్ అక్రమమనే విషయంపై చర్చిస్తారనే మాట కూడా వినిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23. అందులో నలుగురు ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలిపారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారంటూ నలుగురిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో టీడీపీ బలం మారలేదు. ఈ 23 మందిలో సభకు వచ్చేది లేదని చంద్రబాబు తేల్చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు కాబట్టి.. రాలేని పరిస్థితి. దీంతో సభలో టీడీపీ బలం కేవలం 22 మాత్రమే. వీళ్లల్లో మాట్లాడే వాళ్లు ఎంత మంది… గట్టిగా ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వగలిగిన వారు ఎంత మంది అనేది డౌట్. కాబట్టి ఈ సమావేశాలను టీడీపీ బాయ్ కాట్ చేసే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.