బీజేపీతో పొత్తు… లాభమా… నష్టమా… టీడీపీలో అంతర్మథనం..!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పొత్తులు పెట్టుకునేందుకు కూడా రెడీ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సమయంలోనే చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన వెంటనే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించారు కూడా. దీంతో జనసేన మిత్రపక్షం బీజేపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

వాస్తవానికి టీడీపీ ఓడిన తర్వాత దాదాపు రెండున్నర ఏళ్ల పాటు పార్టీ శ్రేణులు సైలెంట్‌గా ఉన్నారు. వారిని తిరిగి యాక్టివ్ మోడ్‌లోని తీసుకువచ్చేందుకు బాబు చాలా కష్టపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి నేతలకు, కార్యకర్తలకు భరోసా, దిశా నిర్దేశం, ర్యాలీలు, ధర్నాలు, పర్యటనలు.. ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయడంతో…. కాస్త సక్సెస్ అయ్యారు కూడా. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ఇప్పటి నుంచే ప్రకటించేస్తున్నారు. అయితే ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల్లో పొత్తులపై చర్చ జోరుగా నడుస్తోంది. పార్టీ ఆరంభం నుంచి వామపక్షాలు, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఏపీలో ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో టీడీపీ అధినేతపై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పొత్తు లేకుండా బాబు ఎన్నికల్లో గెలవలేడని… ఆ విషయం 2019 ఎన్నికల్లో రుజువైందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నా మంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన టీడీపీ, బీజేపీలు.. నాలుగేళ్ల పాటు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కూడా కలిసి కాపురం చేశాయి. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయం కారణంగా దోస్తీకి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ వైసీపీని ఎదుర్కొవాలంటే… నలుగురితో కలిసి అడుగులు వేయాలని బాబు భావిస్తున్నారు. ఇందుకోసం మళ్లీ పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు లాభమా… నష్టమా అనే అంశంపై.. ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం… గతంలో ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ తీరును వ్యతిరేకించి బయటకు వచ్చిన టీడీపీ… మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేది నేతల భావన.

ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే… ప్రజల్లో ఎలాంటి భావన వస్తుందనే విషయం ఇప్పుడు నేతల్లో అయోమయానికి గురి చేస్తుంది. గతంలో ఇదే బీజేపీపైన, మోదీ సర్కార్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే… మళ్లీ పొగడ్తల జల్లు కురిపించాల్సి ఉంటుంది. ఇది అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్లుగా కూడా అవుతుందనేది ప్రస్తుతం నేతల భావన. దీంతో బీజేపీతో పొత్తు… లాభమా… నష్టమా… అనే అంశంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు.