టీడీపీ-జనసేన 90 టార్గెట్..అదే ప్లస్.!

టీడీపీ-జనసేన కలిస్తే..రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకుంటాయా? అంటే ఆ రెండు పార్టీ శ్రేణులు అదే ధీమాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు భారీగా చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిన మాట వాస్తవం. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ గెలిచేది ఏమో గాని..కాకపోతే వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదని చెప్పవచ్చు.

దాదాపు జనసేన 40-50 సీట్లలో ఓట్లు భారీగా చీల్చింది. అంటే ఆయా సీట్లలో టి‌డి‌పిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఆ లెక్కన చూస్తే టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే ఆయా సీట్లలో వైసీపీ గెలుపు కష్టమయ్యేది. అందుకే పవన్ మొదట నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన్ని కలిసిన పవన్..బయటకొచ్చి టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. తమతో బి‌జే‌పి కలిసొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఒకవేళ బి‌జే‌పి కలిసి రాకపోయినా పవన్ మాత్రం టి‌డి‌పితోనే ముందుకెళ్లనున్నారు. టి‌డి‌పి-జనసేన కలిసిన నేపథ్యంలో వైసీపీకి కాస్త రిస్క్ పెరుగుతుందని చెప్పవచ్చు. ఒకవేళ పొత్తులో బి‌జే‌పి ఉంటే అప్పుడు రాజకీయం మారుతుంది..కానీ టి‌డి‌పి-జనసేన మాత్రమే ఉంటే వైసీపీ గెలవడానికి కష్టపడాలి. పైగా తాజా విశ్లేషణల ప్రకారం..టి‌డి‌పి-జనసేన కలిస్తే 90 సీట్లలో గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎలాగో మ్యాజిక్ ఫిగర్ 88..అది దాటి 90 సీట్లు గెలుచుకుంటాయని అంటున్నారు. పైగా వైసీపీపై వ్యతిరేకత ఉందని, అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కలిసొస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే టి‌డి‌పి-జనసేన పొత్తు 100 పైనే సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.