ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై కామెంట్లు చేసిన టీడీపీ నేతలు…. ఇప్పుడు ఎలాంటి విమర్శలు చేయడం లేదు. పైగా కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నారు. ఇక పవన్ పై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసినా… వాటికి కూడా కౌంటర్ ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

పొత్తు దాదాపు ఖాయమవ్వడంతో… ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే ఎమ్మెల్యే స్ఖానాల కేటాయింపులో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా ఇతర పార్టీలను ఇరుకున పెట్టేలా… కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు కూడా చంద్రబాబు. అటు పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యే స్థానాలేవి అనేది రెండు పార్టీలో ప్రధాన నడుస్తున్న చర్చ.

అదే సమయంలో ఎంపీ స్థానాలపై మాత్రం ఇప్పటికే తేల్చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీకి రాష్ట్రంలో 5 స్థానాలు కేటాయించినట్లు సమాచారం. ఇక టీడీపీ – బీజేపీ మధ్య రాయభారం నడిపిన జనసేన పార్టీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందనేది విశ్వసనీయ సమాచారం. తొలి నుంచి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్‌ పార్టీ జనసేనకు అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గం నుంచి అభ్యర్థి లేరనే చెప్పాలి.

ఇక బీజేపీకి రాయలసీమ, కోస్తా జిల్లాలను కేటాయించినట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన తిరుపతితో పాటు రాజంపేట, ఒంగోలు స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. వీటితో పాటు నరసాపురం, నరసరావుపేట స్థానాలను కూడా కమలం పార్టీకి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకే కేటాయించింది టీడీపీ. ఆ ఎన్నికల్లో నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు విజయం సాధించారు. ఇక ప్రస్తుత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. తిరుపతి, రాజంపేట, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఇప్పటి వరకు గెలిచిన సందర్భాలు లేవనే చెప్పాలి. అందుక ఆ మూడు స్థానాలను టీడీపీ వదులుకున్నట్లు తెలుస్తోంది.