కేంద్రం ముందస్తు దిశగా అడుగులు వేస్తుందా…!?

ముందస్తు ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు గుమిగూడిన ఇదే చర్చ. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్‌ ఉందా..? అనేది డౌట్. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్‌ చూస్తుంటే ముందస్తుకు కేంద్రం సిద్దమవుతోందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్‌ అత్యవసర సమావేశాలు పెట్టడం.. జమిలీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెడుతూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం వంటివి జరుగుతున్నాయి. దీని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా కేంద్రం జమిలీ దిశగా.. లేదా ముందస్తు దిశగా అడుగులు వేస్తోందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇదే సందర్భంలో జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలను మేం సమర్థిస్తున్నామని.. జమిలీనే జరగాలంటూ జనసేన లాంటి పార్టీలు మద్దతు ప్రకటించడం.. ఇవన్నీ చూస్తుంటే కేంద్రంతో పాటు.. రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఆ పరిస్థితి ఉందా..? ఇప్పటికిప్పుడే ముందస్తుకు వెళ్తే బీజేపీకి కలిసొచ్చేదేంటీ..? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు రావడం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుంది. పరిస్థితి తమ చేయి దాటిపోకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితి కాదని.. ఆ రాష్ట్రాలతో కలిసి కేంద్రం కూడా ఎన్నికలకు వెళ్తే ప్రత్యేకంగా బీజేపీ కలిసి వచ్చే అంశం కూడా ఏం ఉండదు. పైగా బీజేపీ ఎన్నికలకు వెళ్లే ముందు ఓ ఎమోషనో.. డివోషనో వంటి అంశాలను.. లెక్కలను బేరీజు వేసుకునే ఎన్నికలకు వెళ్తుంది. ఇది బీజేపీ చరిత్రను చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏముంది..? అంటే చంద్రయాన్‌ మినహా పెద్దగా మరేం కన్పించడం లేదు. చంద్రయాన్‌ను కూడా తమ ఘనతగా బీజేపీ తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకున్నా.. ఎన్నికల్లో అది పెద్దగా పండదు. సెంటిమెంట్‌ పిండేలా డ్రామా రక్తి కట్టించడం కష్టమే.

ఇదే సందర్భంలో బీజేపీ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.. మేరీ మట్టి.. మేరీ దేశ్‌ పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి.. ఢిల్లీకి తీసుకెళ్లే కార్యక్రమం ఇది. దీని ద్వారా అందరం ఒకటేననే భావన కల్పించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇది ఎంత వరకు అక్కరకు వస్తుందో చెప్పలేం. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం వ్యవహరం లేదా.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వంటి అంశాలను తెర మీదకు తెస్తేనే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో వర్కవుట్‌ అవుతుందనే ఓ విశ్లేషణ జరుగుతోంది. ఈ రెండింట్లో ఏం జరగాలన్నా.. కొంచెం టైమ్‌ అవసరం. ఈ పరిస్థితుల్లో బీజేపీ ముందస్తుకు వెళ్తుందా..? ఆ దిశగా అడుగులేస్తుందా..? అనేది డౌటేననేది కొందరి భావన. కానీ మెజార్టీ వర్గాలు.. నేతల అభిప్రాయాలు మాత్రం ముందస్తుకు కేంద్రం.. బీజేపీ జాతీయ నాయకత్వం సిద్దమైపోయిందనే చెబుతున్నారు. మరి బీజేపీ జాతీయ నాయకత్వం.. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.. లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ.