టీడీపీలో బిల్డప్ బాబాల హంగామా… ఇలా అయితే ఎలా గురూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు వేల కిలోమీటర్ల మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం అధినేత కష్టంలో కనీస భాగం కూడా పాలుపంచుకోవడం లేదు.

సీనియర్ నేతలు సైతం కేవలం ప్రచారానికి పరిమితం అవుతున్నారు తప్ప…. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించటం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే తప్ప ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయటం లేదు. స్థానిక అధికార పార్టీ నేతలపై పత్రికల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా కూడా.. వాటిపై కనీసం మాట్లాడటం లేదు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలు ఎవరైనా చిన్న కార్యక్రమానికి పిలిచినా సరే వెళ్తున్నారు.

ఇక మరికొందరి తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇంట్లో కూర్చుని ఓ ప్రెస్ నోట్, నాలుగు ఫోటోలు మీడియాకు విడుదల చేస్తున్నారు. అవి ఆయా ప్రాంతాల్లోని చిన్న పత్రికల్లో వస్తే… వాటిని మళ్లీ పార్టీ సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేసి… పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ముఖ్యనేతల పర్యటన సమయంలో.. పూలమాలలతో హంగామా చేస్తున్నారు. తామే పార్టీలో కీలకమనేలా ప్రచారం చేసుకుంటున్నారు.

దీంతో టీడీపీలో బిల్డప్ బాబాలు ఎక్కువయ్యారంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి నష్టం తప్ప.. లాభం ఏమిటని నిలదీస్తున్నారు కూడా. ఇలాంటి వారిని పార్టీ పక్కన పెట్టాలని… పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.