పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చినట్లేనా….!

రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీని ఓడించాలనేది తెలుగుదేశం, జనసేనా పార్టీల ఏకైక లక్ష్యం. అందుకు తగినట్లుగానే దాదాపు రెండేళ్లుగా ఈ రెండు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే మకాం వేశారు. సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప…. పూర్తి సమయంలో పార్టీకే కేటాయిస్తున్నారు పవన్. ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే అపవాదు మూటగట్టుకున్న సోము వీర్రాజు అధ్యక్ష పదవి నుంచి తొలగించి… ఆ బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించారు. పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు పురందేశ్వరి.

ఇక రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడాలనేది జనసేనాని పవన్ కల్యాణ్ తొలి నుంచి చెబుతున్న మాట. అందులో భాగంగానే పొత్తులకు సిద్ధం అంటూ సంకేతాలు ఇచ్చారు కూడా. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఎన్‌డీఏ కూటమి సమావేశాలకు హాజరైన పవన్… టీడీపీతో పొత్తుకు సిద్ధమే అని జాతీయ మీడియా ముందు కూడా ప్రకటించారు. ఇక ఇప్పటికే మూడు సార్లు చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తొలినాళ్లల్లో టీడీపీతో వైరం పెంచుకున్న బీజేపీ నేతలు… ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారు తప్ప…. టీడీపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. గతంలో పొత్తు పెట్టుకునేది లేదన్న కమలం పార్టీ నేతలే… పవన్ వ్యాఖ్యలను ప్రస్తుతం సమర్థిస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమనే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. పొత్తులో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో ప్రత్యేక సమావేశం, ఆర్థిక మంత్రి నిర్మలా రామన్‌తో భేటీ, అమిత్ షాతో అపాయింట్‌మెంట్ అయ్యారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదీ ఏమైనా… రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమే అనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.